గుంటూరు: ఇంటి ముందున్న కొబ్బరిచెట్లను నరకవద్దని చెప్పిన గుంటూరు జిల్లా చుండూరు గ్రామానికి చెందిన సాక్షి విలేకరి బి.నరేంద్రరెడ్డిపై టీడీపీ నేతలు గురువారం దాడి చేసి గాయపరిచారు. విలేకరి ఇంటి ముందున్న కొబ్బరిచెట్లను నరికివేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. పంచాయతీ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించకపోయినా.. రోడ్డు విస్తరణ పనుల పేరిట తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఇళ్ల ముందున్న మెట్లు, అరుగులను అధికార పార్టీ నాయకులు విచక్షణారహితంగా కూల్చివేస్తున్నారు.
ఇందులో భాగంగా నరేంద్రరెడ్డి ఇంటి ఎదుట ఉన్న కొబ్బరిచెట్లను నరకడానికి రాగా ముందస్తు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఆయనపై దాడిచేసి దుర్భాషలాడారు. అంతేకాకుండా దౌర్జన్యంగా కొబ్బరి చెట్లను రంపం మిషన్ తో నరికేసేందుకు యత్నించారు. చెట్టుకు అడ్డంగా నిలిచిన నరేంద్రరెడ్డి కాలును రంపంతో కోశారు. గాయపడిన నరేంద్ర చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేసి వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న ఎస్సీ వ్యక్తితో నరేంద్రరెడ్డి కులం పేరిట దూషించాడని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారు.