ఆన్‌లైన్‌లో శ్రీవారి అర్జిత సేవ టిక్కెట్లు
తిరుమల: ఏడుకొండలవాడి అర్జిత సేవల టిక్కెట్‌లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ విడుదల చేశారు. సెప్టెంబరు నెలకు గాను 44,896 టిక్కెట్‌లను ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 23 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అదే రోజు 12 గంటలకు లాటరీ ద్వారా భక్తలను ఎంపిక చేస్తామని అన్నారు. ఎంపికైన వారి సెల్‌ఫోన్లకు మెసేజ్ రూపంలో సమాచారం వస్తుందని చెప్పారు.
ఇలా ఆరు రకాల టిక్కెట్లు పొందిన భక్తులు తిరిగి ఆరునెలల వరకు అర్జిత సేవలు పొందడానికి అవకాశం ఉండదని తెలిపారు. సుప్రభాతం 6,985 టిక్కెట్లు, తోమాల 90, అర్చన 90, అష్టదళ పాదపద్మారాధన సేవ 120, విశేషపూజ 1,125, నిజపాద దర్శనం 2,300 వంతున 10,710 టిక్కెట్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. కల్యాణోత్సవం 8,250, వూంజల్ సేవ 2,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 4,730, వసంతోత్సవం 9,030, సహస్ర దీపాలంకరణ 9,976 వంతున 34,186 టిక్కెట్లను శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో ఉంచారు. వీటికి లాటరీ విధానం వర్తించదు.