‘పంచాయతీరాజ్ దివస్’లో 8 అవార్డులు
యూపీ సీఎం యోగి నుంచి పురస్కారాలు అందుకున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ పంచాయతీ రాజ్ దివస్‌ను పురస్కరించుకొని ఉత్తమ పనితీరు కనబరిచిన స్థానిక సంస్థలకు కేంద్రం అవార్డులను అందజేసింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు 8 అవార్డులు దక్కాయి. ఎంపికైన గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల ప్రజాప్రతినిధులు సోమవారం లక్నోలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి తోమర్ చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు.
మంత్రి జూపల్లి అభినందనలు...
రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్‌ను సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మీయాదమ్మ అందుకున్నారు. పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కారాలను కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, వనపర్తి జిల్లా ఘనపూర్ ఎంపీపీ కృష్ణ నాయక్, భూపాలపల్లి జిల్లా తాడ్వాయి ఎంపీపీ శ్రీదేవి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సర్పంచ్ భాగ్య, సిరిసిల్ల జిల్లా కస్బెకట్కూర్ సర్పంచ్ మంజుల, గోపాల్ రావుపల్లి సర్పంచ్ రాంరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నిజలాపూర్ సర్పంచ్ ఇంద్రయ్య అందుకున్నారు. రాష్ట్రం నుంచి పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూప్రసాద్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డు గ్రహీతలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు.