మతాలు వేరైనా.. ఫ్రెండ్ షిప్ ఒక్కటే
స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ. భాషకందని కమ్మటి భావన.చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. బుడి బుడి అడుగుల బాల్యంలో అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే.. పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకున్నవి మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ స్కూలో.. కాలేజీలోనో ఊపిరి పోసుకునే స్నేహం.. జీవితంలో ఒక విడదీయరాని బంధమైపోతుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలై.. మనిషన్నవాడు మాయమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడో ఒక చోట ఉన్నతమైన స్నేహాలు వెలుగు రే ఖలై దారి చూపుతుంటాయి. అమ్మా, నాన్న, అన్నా, చెల్లీ.. బంధాలన్నీ దేవుడిస్తే, మనకుమనం ఇచ్చుకునే ఏకైక బంధం స్నేహం. అంతగొప్ప స్నేహానికి హ్యాట్సాఫ్ చెబుతూ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాలివి..
చార్మినార్: మతాలు వేరైనా... వారిద్దరి మనసులు ఒక్కటే. దాదాపు 40 ఏళ్లకు పైగా ప్రాణ స్నేహితులు. ఒకరు రెడ్‌రోజ్ గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సయ్యద్ హమీదుద్దీన్ కాగా... మరొకరు ప్రముఖ వ్యాపారి, మీరాలంమండి మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య. వీరిద్దరు పాతబస్తీలో నాలుగు దశాబ్దాలుగా స్నేహం కొనసాగిస్తున్నారు. వివాహాది శుభకార్యాలతో పాటు పండుగలు, ఇతర కార్యక్రమాల్లో ఇరు కుటంబాలు తప్పనిసరిగా కలుసుకుంటాయి.
ఒకప్పుడు వ్యాపారం నిమిత్తం బేగంబజార్‌లో వీరిద్దరూ స్నేహితులుగా మారారు. అదే స్నేహాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. హమీదుద్దీన్ ఈదిబజార్‌లో నివాసముంటుండగా... గాజుల అంజయ్య మీరాలంమండిలో నివాసముంటున్నారు. మతాలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుంది.