కృష్ణా పుష్కరాలకు రూ.601 కోట్లు ఇవ్వండి
ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కృష్ణా పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లకు రూ.802.19 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నామని, అందులో కేంద్రం వాటాగా రూ.601.65 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యమున్న కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంజూరు చేసే వన్ టైం సెంట్రల్ అసిస్టెన్స్ పద్దులో ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి, ప్రధానిని కోరారు.
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 3.50 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు తరలివచ్చే అవకాశముంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో దాదాపు 281 కిలోమీటర్ల పొడవున కృష్ణా నది ప్రవహిస్తోంది. భక్తులు పుష్కర స్నానాలను ఆచరించేందుకు నిర్మించే స్నానఘట్టాలు, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.802.19 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పుష్కరాల నిర్వహణకు చేపట్టాల్సిన అత్యవసర పనులు, అందుకు అవసరమయ్యే నిధులు, విభాగాల వారీ అంచనాలతో తయారు చేసిన సమగ్ర నివేదిక ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖకు, నీతి ఆయోగ్‌కు పంపించినట్లు సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
బుద్ధ జయంతి శుభాకాంక్షలు: కేసీఆర్
సమత, కరుణ, విజ్ఞానాల కలయికతో సమాజం పురోగమించాలని ప్రబోధించిన గౌతమ బుద్ధుడి 2,578వ జయంతిని పురస్కరించుకొని సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం బుద్ధ జయంతి సందర్భంగా సీఎం సందేశం ఇచ్చారు. భారత్‌లోనే కాకుండా దక్షిణాసియా దేశాలన్నింటిలో బౌద్ధం ప్రధాన జీవన స్రవంతిగా కొనసాగుతుందన్నారు. బౌద్ధం ఆశించిన శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం అనుసరణీయ మార్గాలని వివరించారు. తెలంగాణలో బుద్ధుడు జీవించిన కాలంలోనే బౌద్ధం వ్యాపించి నేటిదాకా సామాజిక జీవనాన్ని ప్రభావితం చేయడం గర్వకారణమన్నారు.