రుణాల మంజూరులో వివక్ష వద్దు | No discrimination in loans | Sakshi
Sakshi News home page

రుణాల మంజూరులో వివక్ష వద్దు

Published Wed, Oct 30 2013 3:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

No discrimination in loans

సాక్షి, సిటీబ్యూరో:  పేద వర్గాలకు సంక్షేమ రుణాలను అందించడంలో వివక్ష చూపవద్దని, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రుణ మంజూరులో బ్యాంకర్ల తీరు అసంతృప్తిగా ఉందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువజన సంక్షేమం, గిరిజన సంక్షేమ రుణాలందిం చడంలో ఉన్న శ్రద్ధ.. ఇతర  వర్గాల లబ్ధిదారుల పట్ల ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. జూన్, జూలైలోనే వివిధ కార్పొరేషన్ల నుంచి దరఖాస్తులు అంది నా, నేటికీ కొన్ని బ్యాంకు శాఖల్లో లబ్ధిదారులకు రుణ ఖాతాలను తెరవకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
 
 నవంబరు 15 లోగా పూర్తి చేయండి 
 సంక్షేమ రుణాలను సకాలంలో అందించడం బ్యాంకర్లు తమ వంతు బాధ్యతగా భావించాలని కలెక్టర్ తెలిపారు. నవంబరు 15లోగా లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. 20వ తేదీలోగా మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఎల్పీజీ వినియోగదారులకు ఆధార్ సీడింగ్‌పై కొంత కాలంగా బ్యాంకులు దృష్టి కేంద్రీకరించడమే రుణాల మంజూరులో జాప్యానికి కారణమన్నారు. 
 
 బ్యాంకర్స్ వర్సెస్ కార్పొరేషన్స్
 సమావేశంలో బ్యాంకర్లకు, కార్పొరేషన్ల అధికారుల మధ్య కాసేపు వాగ్వాదం జరగడంతో డీఎల్‌ఆర్‌సీ సమావేశం కాస్తంత వేడిగా సాగింది. రుణాలు తీసుకుంటున్న లబ్దిదారులు తిరిగి చెల్లించడంలేదని, రుణాలు ఇప్పించడంలో హడావిడి చేసే కార్పొరేషన్ల అధికారులు.. రికవరీ విషయంలో తమకు సహకరించడం లేదని బ్యాంకర్లు ఆరోపించారు. అయితే, లబ్ధిదారులు తిరిగి చెల్లించకపోతుండడానికి మంజూరులో జరుగుతున్న జాప్యమే కారణమని కార్పొరేషన్ల అధికారులు స్పష్టం చేశారు. రోజుల తరబడి వారిని తిప్పుతున్నారన్నారు. దీంతో కలెక్టర్ కలగజేసుకొని లబ్ధిదారులను అనవసరంగా తిప్పుకోవడం మంచిది కాదని బ్యాంకర్లకు హితవు పలికారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఖాజా నాజిమ్ అప్సర్ అలీ, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ అక్రమ్ అలీ, యువజన సంక్షేమాధికారి సత్యనారాయణరెడ్డి, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement