పాలమూరు ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
జడ్చర్ల: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన జడ్చ ర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ నీటి సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించి ముంపును తగ్గించాలని కోరారు. రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
123 జీవో ప్రకారంగానే ఎక్కువ పరిహారం అందుతుందని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెప్పడం.. ప్రజలను మోసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ నెల 16న ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని నిర్వాసిత గ్రామాల్లో తాము పర్యటించనున్నట్లు వెల్లడించారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలోనే బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ‘సుప్రీం’
మహబూబ్‌నగర్ అర్బన్: అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని డాక్టర్ మల్లు రవి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టి దేశ ప్రతిష్టను ప్రపంచదేశాల్లో మంటగలిపిందని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో యూనివర్సిటీల్లో విద్యార్థులపై వేధింపులు అధికమయ్యాయని, మాట్లాడే స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మల్లు రవి విమర్శించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, అమరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.