దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యుత్ టారిఫ్!
- కేంద్ర ఇంధనశాఖ ప్రతిపాదన
- సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కమిటీ
- రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యుత్ టారిఫ్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించింది. కేంద్ర ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ కమిటీల ప్రతినిధులను సభ్యులుగా చేర్చారు.
ఏపీ నుంచి ఈఆర్‌సీ సెక్రటరీ శ్రీనివాస్‌కు చోటు దక్కింది. కాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఈఆర్‌సీలు, పంపిణీ సంస్థలు ఏకీకృత విద్యుత్ టారిఫ్ అమలుపై అభిప్రాయాలను చెప్పాలని కమిటీ లేఖలు రాసింది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంస్థలు, విద్యుత్ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వచ్చే నెల 4వ తేదీలోగా తెలపాలని ఏపీఈఆర్‌సీ కోరింది.
కేంద్ర ఇంధనశాఖ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు...
- ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన టారిఫ్ అమల్లో ఉంది. దీనివల్ల పవర్ సబ్సిడీని నిర్దిష్టంగా లెక్కగట్టడం సాధ్యం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఒకే తరహా టారిఫ్ ఉంటే ఇది సాధ్యమవుతుంది.
- ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా విద్యుత్ వినియోగదారుల కేటగిరీలున్నాయి (ఏపీలో 7 కేటగిరీలున్నాయి). అలాకాకుండా దేశవ్యాప్తంగా ప్రధానంగా నాలుగు విద్యుత్ కేటగిరీలే (గృహ, వాణిజ్య, వ్యవసాయ కేటగిరీలతో పాటు ప్రభుత్వ రంగం, వీధిదీపాలు, ఆస్పత్రులు తదితరాలతో ఒక కేటగిరీ) ఉంటే బావుంటుంది.