సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ కీలక పోస్టుల్లో పూర్తిస్థాయి అధికారుల్లేక పాలన కుంటుపడింది. ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారిసహా ఇతర ముఖ్య పోస్టుల్లోనూ ఒక్కరే ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో వైద్య సేవల నిర్వహణపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది. వైద్య, ఆరోగ్య పథకాలు, కార్యక్రమాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణను ప్రభుత్వం ఇటీవల భూపరిపాలన డైరెక్టర్‌గా బదిలీ చేసింది. దీంతో ఆ స్థానంలో పూర్తిస్థాయి అధికారిని ఇంకా నియమించలేదు. కరుణకే ఈ బాధ్యతను అదనంగా అప్పగించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వైద్యసేవలను పర్యవేక్షించే వైద్య విధాన పరిషత్‌కు కూడా పూర్తిస్థాయి అధికారి లేరు. ఇప్పటిదాకా కరుణ అదనంగా ఈ బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) తెలంగాణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అధికారి లేరు. ఈ బాధ్యతలను కూడా కరుణ ఇప్పటి దాకా అదనంగా నిర్వర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ప్రక్రియ నిర్వహించే భారత కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ డైరెక్టర్‌గానూ కరుణ వ్యవహరించారు.
∙రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వైద్య సేవలను అందించే కీలకమైన ఆరోగ్యశ్రీ వైద్య సహాయ ట్రస్టుకు పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేరు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డైరెక్టర్ కె.మనోహర్‌కు ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టును అదనంగా కేటాయించారు. ఈ రెండూ పెద్ద సంస్థలే కావడంతో పర్యవేక్షణ కొరవడి వాటిల్లో పరిపాలన గాడితప్పుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
∙వైద్య, ఆరోగ్య శాఖ విధాన నిర్ణయాల్లో కీలకమైన అదనపు కార్యదర్శి పోస్టులోనూ ఇన్‌చార్జే ఉన్నారు. తెలంగాణ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ సీఈవో సోనిబాలదేవికి అదనపు కార్యదర్శి బాధ్యతను అదనంగా కేటాయించారు.
∙యోగాధ్యయన పరిషత్ ఉన్నతాధికారి పోస్టు(కార్యదర్శి)లోనూ మరో విభాగం ఉన్నతాధికారి అదనంగా బాధ్యతలు చూస్తున్నారు. ఆయుర్వేద, యోగా, ప్రాకృతిక, యునానీ, హోమియోపతి(ఆయుష్) కమిషనర్ డాక్టర్ ఎ.రాజేందర్‌రెడ్డికి యోగాధ్యయన పరిషత్ కార్యదర్శి పోస్టును అదనంగా కేటాయించారు.
ఇన్‌చార్జీలతో ఇంకెంత కాలం?
Published Fri, Jan 19 2018 3:01 AM | Last Updated on Fri, Jan 19 2018 3:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment