డిస్కంపై ఈఆర్సీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: ‘విశ్వనగరం’ హైదరాబాద్‌లో ఈ నెల 6, 20 తేదీల్లో గాలివాన సృష్టించిన బీభత్సంతో ఎక్కడికక్కడ స్తంభించిన విద్యుత్ సరఫరాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) సకాలంలో పునరుద్ధరించకపోవడంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) మండిపడింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యమంతా హైదరాబాద్‌లోనే ఉన్నా ఏమీ చేయలేకపోయిందని విమర్శించింది. పలు ప్రాంతాల్లో 3, 4 రోజుల తర్వాత కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదంటూ దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన ఈఆర్సీ... ఈ అంశంపై రెండు వారాల్లో వివరణ సమర్పించాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యానికి నోటిసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో 2 వారాల వ్యవధిలో 2 సార్లు వచ్చిన గాలివాన వల్ల భారీ సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలి నగరవ్యాప్తంగా విద్యుత్ సరఫరా స్తంభించడం తెలిసిందే.
చాలా ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను టీఎస్‌ఎస్పీడీసీఎల్ పునరుద్ధరించగలిగినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం జాప్యం జరిగింది. ఈ నెల 20న రెండోసారి గాలివాన నగరాన్ని కుదుపేసిన తర్వాత కొన్ని కాలనీల్లో ఇంకా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. విద్యుత్‌శాఖ ‘ఫ్యూజ్ ఆఫ్ కాల్’ నంబర్లతోపాటు టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్లకు వివిధ కాలనీలవాసులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా అధికారులు, సిబ్బంది సకాలంలో క్షేత్రస్థాయికి చేరుకోలేదని పత్రికలతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన టీఎస్‌ఈఆర్సీ... ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యం సిద్ధంగా లేకపోవడం వల్లే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు నోచుకోలేదని తప్పుపట్టింది. 3 రోజులైనా విద్యుత్ సరఫరాకు నోచుకోని సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల పేర్లను సైతం నోటీసులో ఉటంకించింది. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయాలను నిలువరించేందుకు అమలు చేయాల్సిన అత్యవసర ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ఆదేశించింది.
భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులు ఎదురైతే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి క్షేత్రస్థాయిలో విపత్తుల నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులో పేర్కొంది. గాలివాన తర్వాత నగరంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో విద్యుత్‌శాఖ విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయంటూ మంత్రి కేటీఆర్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా తాజాగా ఈఆర్సీ ఘాటు వ్యాఖ్యలు చేయడం టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యాన్ని ఆత్మరక్షణలో పడేసింది. విద్యుత్ సంస్థల పనితీరుపై భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల సందర్భంగా తాజా పరిణామాలు ప్రభావం చూపుతాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.