సాక్షి, హైదరాబాద్: కాకతీయ తోరణం ఆకృతిలో భవనం.. లోనికి వెళ్లగానే ఆధునీకరించిన టికెట్ కౌంటర్లు, రైలు వచ్చే వరకు వేచి ఉండేందుకు విశాలమైన ప్రాంగణం, కాసేపు సేదతీరేందుకు ప్రత్యేకంగా గదులు, ఉచిత వైఫై, ఎస్కలేటర్లు, లిఫ్టులు, సీసీ కెమెరా నిఘా.. మంచినీటి కియోస్క్‌లు.. ఇవన్నీ వరంగల్ రైల్వే స్టేషన్‌లో త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటితో కూడిన అద్భుతమైన భవనాన్ని వరంగల్ రైల్వే స్టేషన్ కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సిద్ధం చేయనున్నారు.
తెలంగాణలో వరంగల్ స్టేషన్‌కే..
దేశవ్యాప్తంగా ప్రయాణికులు, పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ చోటు దక్కించుకుంది. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తయ్యేలా రైల్వే శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రపంచ పర్యాటకంలో భారత్‌కు సముచితస్థానం దక్కాలని కేంద్రం నిర్ణయించింది. పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని గుర్తించింది.
అయితే ఆయా రైల్వే స్టేషన్లలో వసతులు సరిగా ఉండకపోవడంతో పర్యాటకంపై దుష్ప్రభావం పడుతోందని కేంద్రానికి పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు 600 స్టేషన్లలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు గతంలోనే కసరత్తు ప్రారంభించింది. 90 స్టేషన్లను ప్రత్యేకంగా ముస్తాబు చేయాలని తాజాగా గుర్తించింది. ఇందులో తెలంగాణ నుంచి ఒక్క వరంగల్ స్టేషన్‌కే అవకాశం దక్కింది. రీడెవలప్‌మెంట్‌కు ఆర్కిటెక్ట్‌ల సాయం అవసరమని భావించిన రైల్వే శాఖ ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌ను సంప్రదించింది. దీనికి ఆయన ఆమోదముద్ర వేశారని అధికారులు చెబుతున్నారు.
ఏం చేస్తారు..
వరంగల్ అనగానే గుర్తుకొచ్చేది కాకతీయ కళాతోరణం. కాకతీయ సామ్రాజ్య వైభోగం ప్రతిఫలించేలా స్టేషన్ భవనం నిర్మించనున్నా రు. దీంతోపాటు అన్ని ప్లాట్‌ఫామ్స్ వద్ద ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక వెయిటింగ్ హాళ్లు, ఎల్‌ఈడీ లైట్లు, సీసీ కెమెరాలు, ఉచిత వైఫై, ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక వాష్‌రూమ్స్, స్టేషన్ ప్రాంగణంలోనే ఒకట్రెండు రోజులు ఉండేలా వసతి గదులు, మంచినీటి కియోస్క్‌లు.. ఇలా అన్ని వసతులు ఆధునికంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. నిత్యం 45 వేల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో పాటు, ఎక్కువగా పర్యాటకులు వచ్చే ప్రాంతాలను దీనికి ఎంపిక చేశారు.
ఏపీలో ఏడు స్టేషన్‌లు..
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏడు స్టేషన్‌లను ఎంపిక చేశారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, గుం టూరు, గుంతకల్, కర్నూలు సిటీ స్టేషన్‌లకు ఈ అవకాశం దక్కింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే పది స్టేషన్‌లను గుర్తించింది.
సికింద్రాబాద్ సంగతేంటి?
రెండేళ్ల కింద రైల్వే బడ్జెట్‌లో స్టేషన్ రీడెవలప్‌మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా 25 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఆ ప్రాజెక్టులో రైల్వేస్టేషన్ భవనాన్ని వాణిజ్యపరంగా మార్చనున్నట్లు అధికారులు చెప్పారు.
కానీ దానికి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ.. ‘దానికి, దీనికి సంబంధం లేదు. అది ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే వాణిజ్యపరమైన ప్రాజెక్టు, ఇది ప్రయాణికులకు వసతులు మెరుగుపరిచి, పర్యాటకులను ఆకట్టుకునేలా స్టేషన్‌ను తీర్చిదిద్దే ప్రాజెక్టు. దీన్ని రైల్వేనే చేపడుతుంది’ అని ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment