బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమేనా!
కేసీఆర్‌పై వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే ఇష్టానుసారంగా విద్యుత్, బస్సు చార్జీలు పెంచడమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ అద్భుతాలే జరుగుతాయని కేసీఆర్ ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కనుచూపు మేరలో ఏ ఎన్నికలూ లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచిందన్నారు. తండ్రి, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ రోజుకో అంకె పెంచుతూ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందని చెబుతున్నారన్నారు. రెండేళ్ల పాలన విజయోత్సవాలు,పూర్తి కాని సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి రూ.300 కోట్లు ఖర్చు చేయటానికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయన్నారు. ‘సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన చార్జీలు భారమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి’ అని కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.
నేడు భారీ నిరసన ప్రదర్శన, ధర్నా...
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతూ శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ భారీ నిరసన ప్రదర్శన, ధర్నా చేపడుతున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.