అమ్ముడయ్యే ఫోన్లలో 98 శాతం స్మార్ట్ ఫోన్లే!
మొబైల్ ఇంటర్నెట్ వాడకం అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరిశోధనా సంస్థ ఐజీఆర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. హ్యాండ్‌సెట్ల అమ్మకాల్లో 2020 నాటికి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 98 శాతం ఉండే అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలిందని చెబుతోంది.
పలు కారణాలతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు సైతం ధరలు అందుబాటులోకి రావడం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో అభివృద్ధికి ప్రధాన కారణమని ఐజీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇయాన్ గిల్లోట్ అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో వినియోగదారులు తమ జీవనశైలికి అనుగుణంగా ఉండే పోర్టబుల్, డేటా డ్రివెన్ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నారని గిల్లోట్ అంటున్నారు.
హ్యాండ్సెట్ అమ్మకాల అభివృద్ధిలో భాగంగా 2015 సంవత్సరంలో దాదాపు 200 కోట్ల మొబైల్ హ్యాండ్ సెట్లు విక్రయించగా వాటిలో అత్యధికశాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయని, ఈ అభివృద్ధి 2020 నాటికి మరింత పెరిగి సుమారు 98 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐజీఆర్ గ్లోబల్ హ్యాండ్ సెట్.. స్మార్ట్ ఫోన్ సేల్స్ విభాగం చెబుతోంది.