ఆనందం అంటే స్విట్జర్లాండ్ ప్రజలదే
న్యూయార్క్: ప్రపంచ దేశాల్లో ఏ దేశం ప్రజలు ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో జీవిస్తున్నారు? ఏ దేశస్థులు బతుకుకు భద్రత లేకుండా విషాధభరిత బతుకీడుస్తున్నారు ? యువతీ యువకుల్లో ఎవరు ఎక్కువ సంతోషంగా జీవిస్తున్నారు. వృద్ధులు, యువకుల్లో ఎవరు ఎక్కువ ఆనందంగా ఉంటున్నారు? అన్న అంశాలపై ‘సస్టేనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (ఎస్‌డీఎస్‌ఎన్) సర్వే జరిపి ఓ సమగ్ర నివేదికను గురువారం నాడిక్కడ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం స్విడ్జర్లాండ్ ప్రజలు ప్రపంచ ప్రజల్లోకెల్లా ఆనందోత్సావాలతో బతుకుతున్నారు.
ఆ తర్వాత స్థానాల్లో ఐస్‌లాండ్, డెన్‌మార్క్, నార్వే, కెనడా తదితర దేశాలున్నాయి. అగ్ర దేశాలు, ఆర్థికంగా బలమైన దేశాలు, భారత్‌లాంటి వర్ధమాన దేశాలు ఈ వరుసలో లేకపోవడం గమనార్హం. దేశ ప్రజల ఆయురారోగ్యాలు, జీవన విధానం, తోటి ప్రజల పట్ల పరస్పర విశ్వాసాలు, నీతి నిజాయితీలు, సామాజిక భద్రత లాంటి తదితర అంశాలతోపాటు జాతీయ స్థూల ఉత్పత్తి లాంటి ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజల ఆనందోత్సవాలను ఇండెక్స్‌ను రూపొందించారు. ఎస్‌డీఎస్‌ఎన్ మొత్తం 158 దేశాల అధ్యయన సమాచారాన్ని క్రోడీకరించి ప్రపంచంలో స్విడ్జర్లాండ్ ప్రజలే ఎక్కువ సంతోషంగా ఉన్నారని తేల్చింది. పపంచవ్యాప్తంగా పురుషులకన్నా కొంచెం స్త్రీలే ఎక్కువగా ఆనందంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. అలాగే వృద్ధులకన్నా యువతీయువకుల్లోనే ఆనందంగా జీవిస్తున్నామన్న భావన ఎక్కువగా ఉంది.
ఇక ప్రపంచంలో అత్యంత విషాదంగా బతుకీడిస్తున్న వారు టోగో, బురుండి, సిరియా, బెనిన్, రువాండా దేశస్థులని సర్వేలో వెల్లడైంది. తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న గ్రీస్ దేశస్థులు కూడా విషాధ ఛాయల్లోనే జీవిస్తున్నారు. రాజకీయ, సామాజిక అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈజిప్టు దేశాల్లో కూడా ప్రజల హాపినెస్ గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత సర్వేతో పోలిస్తే ప్రపంచంలోని 53 దేశాల ప్రజల్లో ఆనందకర పరిస్థితులు మెరుగుపడగా, 41 దేశాల్లో క్షీణించాయి. 36 దేశాల ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు. మార్చి 20ని అంతర్జాతీయ అనందోత్సవ దినంగా ఐక్యరాజ్య సమితి 2012లో ప్రకటించిన నాటి నుంచి ప్రతిఏటా ఈ అంశంపై ఎస్‌డీఎస్‌ఎన్ అంతర్జాతీయ సర్వే నిర్వహిస్తోంది.