న్యూయార్క్ : కరోనా వైరస్ చికిత్సకు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేకపోవడంతో రోగులకు ఉపశమనంగా పలు మందులను చికిత్సలో ఉపయోగిస్తున్నారు. మహమ్మారి చికిత్సలో మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్వీన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశోధకులు ఆ మందులో పస లేదని తేల్చడంతో మిరాకిల్ డ్రగ్ కోసం వారానికో మందును చెప్పుకొస్తున్నారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ పరమౌషధమని చెప్పిన ట్రంప్ ఆ తర్వాత అతినీలలోహిత కిరణాలు కోవిడ్-19 చికిత్సకు ఉపకరిస్తాయని చెప్పారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యుల తరహాలో ట్రంప్ సైతం కరోనా చికిత్సకు అద్భుత ఔషధం వేటలో పడినట్టు పలు ప్రకటనలు చేస్తున్నారు.
తాజాగా ట్రంప్ నోటివెంట కోవిడ్-19కు మరో మందు ముందుకొచ్చింది. రెమిడిసివిర్ మందు కోవిడ్-19 చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందే వైరస్ రోగులకు ఇది సరైన ఔషధమని, మీడియా సహా పరిశోధక నివేదికలు సైతం ఇదే విషయం వెల్లడిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎబోలా వైరస్ ఇన్ఫెక్షన్స్‌లో చికిత్సకు ఉపయోగించేలా అభివృద్ధి చేసిన రెమిడిసివిర్ 2002లో సార్స్ వ్యాప్తిచెందిన సమయంలో సమర్ధంగా పనిచేసింది. మెర్స్ వ్యాప్తినీ ఈ మందు ప్రభావవంతంగా అడ్డుకుంది.
చదవండి : లక్ష మరణాలు.. చాలా భయంకరం: ట్రంప్
దీంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ మందు పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. రెమిడెసివిర్‌ను ఇచ్చిన రోగుల్లో రికవరీ రేటు 30 శాతం పెరిగిందని, మరణాల రేటు నాలుగు శాతం తగ్గిందని వెల్లడైంది. అయితే రెమిడిసివిర్ కోవిడ్-19కు అద్భుత ఔషధమని ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పరిశోధకులు సూచించకపోవడం గమనార్హం. కోవిడ్-19 చికిత్సలో రెమిడిసివర్‌ను అనుమతించే ముందు మరింత పరిశోధన అవసరమని వైద్యారోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment