ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
‘వలసల’పై ఆదేశాలను పునరుద్ధరించాలని కోర్టుకు ప్రభుత్వం వినతి
► సర్కారు అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
► నేటిలోగా ప్రతిస్పందన తెలపాలని అధికారులకు ఆదేశం
వాషింగ్టన్ : దూకుడుగా ముందుకెళ్తున్న ట్రంప్‌కు అమెరికా కోర్టు మరోసారి షాకిచ్చింది. శనివారం నాటి సియాటెల్ కోర్టు తీర్పు (ట్రంప్ వీసాల రద్దు నిర్ణయంపై తాత్కాలిక నిషేధం)ను సవాల్ చేస్తూ.. ట్రంప్ నిర్ణయాన్ని అమలు చేయాలంటూ వేసిన పిటిషన్ ను శాన్ ఫ్రాన్సిస్కో అప్పీల్స్ కోర్టు ఆదివారం తిరస్కరించింది. ఏడు ముస్లిం దేశాలనుంచి వలసవచ్చే వారి వీసాలను రద్దుచేస్తూ అమెరికా సర్కారు కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేయగా.. సియాటెల్ కోర్టు దీనిపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ అమెరికా ప్రభుత్వాధికారులు అప్పీల్స్ కోర్టులో పిటిషన్ వేశారు. సియాటెల్ కోర్టు తీర్పును కొట్టేస్తూ.. వెంటనే ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాల అమలుకు ఆదేశాలివ్వాలని అందులో కోరారు.
దీనిపై విచారించిన కోర్టు ఆదివారం ట్రంప్ సర్కారు విజ్ఞప్తిని తిరస్కరించింది. ‘ప్రభుత్వ ఆదేశాల అమలుకు వెంటనే అనుమతివ్వాలన్న అప్పిలెంట్ సూచనను తిరస్కరిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. వలసల రద్దును సవాల్ చేస్తున్న వారు అప్పీల్ చేసుకోవాలని, న్యాయశాఖ దీనిపై సోమవారం లోగా ప్రతిస్పందన దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని న్యాయశాఖ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. జిల్లా కోర్టు జడ్జికి అధ్యక్షుడి ఆదేశాలను ఆపే అధికారం లేదని వాదించారు. అటు, వీసాలపై నిషేధం ఎత్తేయటంతో ఆ ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రయాణికులు అమెరికా వస్తున్నారు. మరోవైపు, కోర్టు తీర్పు తమకు అనుకూలంగానే ఉన్నా.. అమెరికాలో ట్రంప్ వ్యతిరేకుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
జడ్జి చేతిలో దేశ భద్రతా?: ట్రంప్
అప్పీల్స్ కోర్టు విచారణకు ముందు ట్రంప్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయమది. మేం తప్పకుండా గెలుస్తాం’ అని శ్వేతసౌధ అధికారులతో ఆదివారం ఉదయం అన్నారు. ‘జేమ్స్ రాబర్ట్ (సియాటెల్ కోర్టు జడ్జి) దేశాన్ని ఉగ్రవాదులకు దార్లు తెరిచేలా తీర్పునిచ్చారు. దేశ అంతర్గ భద్రతను ఒక జడ్జి ఎలా నిర్ణయిస్తారు? ’ అని ట్రంప్ కోర్టు తీర్పుకు ముందు ట్విటర్‌లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ టోపీ ధరించిన బాలునిపై దాడి
‘మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా మార్చుదాం’ అనే ట్రంప్ నినాదం రాసిఉన్న టోపీ ధరించి పాఠశాలకు వెళ్తున్న 12 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ట్రంప్ మెక్సికో సరిహద్దులో గోడకడతానంటున్నాడు.. నీవు దాన్ని సమర్థిస్తావా? అని ఆ విద్యార్ధిని ప్రశ్నించారు. దీంతో మాటా మాటా పెరిగి తోపులాటకు దారితీసింది. దీంతో సీనియర్ విద్యార్థులు బాలుడిపై పిడిగుద్దులు కురిపించారు.