మీరు నిద్రపోతున్నారు.. పోతున్నారు.. పోతున్నారు.. గుర్ర్..
వీళ్లిలా ఎందుకు ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్నారో తెలుసా? చిత్రంలో కనిపిస్తున్న ప్రిన్సెస్ అనే బుల్లి కుక్క వీరిని హిప్నటైజ్ చేసింది అందుకే!! ఈ కుక్క మన కళ్లలోకి అలా చూస్తే చాలు.. సినిమాలోలాగా రింగులు రింగులు తిరిగినట్లు అయి.. నిద్ర అదే ముంచుకొస్తుందని దీని యజమాని క్రిస్టినా లెనన్ చెబుతున్నారు. దానికి నిదర్శనమే ఈ ఫొటో. గత రెండేళ్లుగా ప్రిన్సెస్ బ్రిటన్‌లో తన టాలెంట్‌ను చూపిస్తూనే ఉంది.
అదెలా సాధ్యం అని క్రిస్టినాను ప్రశ్నిస్తే.. తాము వేటాడే జంతువులను హిప్నటైజ్ చేసే సామర్థ్యం కుక్కలకు ఉంటుందని చెప్పారు. అదే సమయంలో అన్ని శునకాలకూ ఆ సామర్థ్యం ఉండదని.. ప్రిన్సెస్‌కు మాత్రం ఈ ప్రత్యేక లక్షణం జన్మతః అబ్బిందని.. దానికి తన శిక్షణ తోడైందని పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. క్రిస్టినా కూడా హిప్నటిస్టే. దీంతో ప్రదర్శనల్లో కుక్కకు బదులు ఆమే జనాన్ని హిప్నటైజ్ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కుక్కలు హిప్నటైజ్ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. అయితేనేం.. వీరి షోలకు మాత్రం తెగ డిమాండ్ ఉంది. ప్రస్తుతం క్రిస్టీనా, ప్రిన్సెస్‌లు బ్రిటన్ అంతా పర్యటిస్తూ.. వివిధ వర్సిటీల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.