17 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు | Chinese girl Tang Shuzhuo reunited with her mother after 17 years | Sakshi
Sakshi News home page

17 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు

Published Tue, Jan 5 2016 5:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

17 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు

17 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు

బీజింగ్: రెండేళ్ల వయస్సులో తప్పిపోయిన కూతురును 17 ఏళ్ల అనంతరం ఊహించని విధంగా కలుసుకుంటే ఆ తల్లికి కలిగే అనుభూతి, ఆనందం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అప్పటి వరకు తనను పెంచిన తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు కాదని తెలిస్తే కలిగే బాధ, కన్న తల్లిదండ్రులను కలుసుకున్నాననే ఆనందం కలగలిపి ఎలా ఉంటుందో ఆ కూతురుకే తెలియాలి. దక్షిణ చైనాలోని డోంగ్వాన్ నగరంలో నివసిస్తున్న లూ కిర్యూ, టాంగ్ షుజువూ అనే తల్లీ కూతుళ్లకు డిసెంబర్ 27వ తేదీన అలాంటి అనుభూతులే కలిగాయి.

రెండేళ్ల వయస్సులో తప్పిపోయి ఇప్పుడు 19 ఏళ్ల వయస్సున షుజువూను కలసుకున్నప్పుడు ఆనందం లాంటి బాధ కలిగిందీ లూ కిర్యూకు. కళ్ల నుంచి ఆనంద భాష్పాలు కారుతుండగా కూతురు షుజువూను ఆత్మీయంగా గట్టిగా అదుముకుంది. అప్పుడు ఆ తల్లి కను కొనల్లో ఓ మెరపు తళుక్కుమంది. అప్పుడు కూతురు మొహంలోనూ చిరుదరహాసం ఓ తృప్తి కనిపించింది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరిని కలిపిందీ ఓ ‘ఫ్యామిలీ ఫైండింగ్’ వెబ్‌సైట్. దశాబ్దాల క్రితం ఇలా విడిపోయిన అక్కాచెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, తల్లీ కూతళ్లు సోషల్ మీడియా కారణంగా ఇటీవల కలసుకుంటున్న విషయం తెల్సిందే.

షుజువూ 1998, అక్టోబర్ 19వ తేదీన తల్లి దండ్రులకు దూరమైంది. నగరంలోని ఓ పాఠశాలలో లూ కిర్యూ, ఆమె భర్త టాంగ్ యున్‌ఫూ క్యాంటీన్ నడిపేవారు. అక్టోబర్ 19వ తేదీన క్యాంటీన్ సిబ్బంది రెండేళ్ల పాప షుజువూను ఆడించేందుకు పాఠశాల వెలుపలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ పాప గురించి మరచిపోయారు. అలవాటు చొప్పున క్యాంటీన్ సిబ్బందే పాపను ఇంటికి తీసుకొస్తారని భావించిన తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిపోయారు. ఈలోగా పాఠశాల ముందు వీధిలో ఒంటరిగా ఏడుస్తున్న ఓ పాపను దారిన పోతున్న చెన్ అనే వ్యక్తి చేరదీసి ఊరడించారు. చాలాసేపు అక్కడే నిరీక్షించినప్పటికీ ఎవరూ రాకపోవడంతో అదే నగరానికి చెందిన చెన్ తనకు పిల్లలు లేకపోవడంతో ఆ పాపను తన ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి షుజువూ వారింటిలోనే పెరుగుతూ వచ్చింది. ఆ పాపకు చెన్ గౌలి కొత్త పేరు కూడా పెట్టారు.

కూరగాయలు విక్రయిస్తూ బతికే పెంపుడు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఇంతకాలం షుజువా ఉంటూ వచ్చింది. మూడు నెలల క్రితమే పెంచి తల్లీదండ్రుల నుంచి తాను వారి బిడ్డను కాదనే విషయం షుజువూకు తెల్సింది. తన అసలు తల్లిదండ్రుల గురించి ఎలాగైనా తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తన కజిన్ సహాయంతో చైనా భాషలో ‘పాపా, ఇంటికి రా’ అనే అర్థం వచ్చే వెబ్‌సైట్‌ను ఆశ్రయించింది. ఆ వెబ్‌సైట్ నిర్వాహకుల ద్వారా గత అక్టోబర్ నెలలో డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకుంది. పిల్ల తప్పిపోయినట్టు ఫిర్యాదు ఇచ్చిన తల్లిదండ్రుల గురించి పోలీసుల సహాయంతో వాకబు చేసింది. చివరకు సమాచారం తెల్సింది. పోలీసులు ఆమె డీఎన్‌ఏతో తల్లిదండ్రుల డీఎన్‌ఏను పోల్చి తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement