గ్యాంగ్ రేప్ బాధితురాలి తెగువ!
కరాచీ: ఆమె స్థానంలో మరొకరు ఉండివుంటే ఆత్మహత్యచేసుకునేవారమో. కానీ అందరిలా ఆమె కుమిలిపోలేదు. తనను పరాభవించిన వారిపై న్యాయపోరాటం చేసింది. అక్కడితో ఆగకుండా తనలా అవమానికి గురైన వారికి ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ధైర్యంగా ముందుడుగు వేసింది. ఆమె పేరు ముఖ్తార్ మాయ్. పాకిస్థాన్ లో 14 ఏళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఆమె కరాచీలో బుధవారం జరిగిన ఫ్యాషన్‌షోలో పాల్గొంది. మోడళ్లతో కలసి ర్యాంప్‌పై తలెత్తుకుని నడిచింది.
ముఖ్తార్ మాయ్ 2002లో ఘోర పరాభవానికి గురైంది. స్థానిక పెద్దలు ఆమెపై అత్యాచారం చేయించి నగ్నంగా ఊరేగించారు. మాయ్ సోదరుడు ప్రత్యర్థి వర్గాన్ని అవమానించాడన్న కారణంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. తనపై తీవ్ర అవమానానికి గురిచేసిన వారిపై ఆమె అలుపెరగని న్యాయపోరాటం చేసింది. 14 మంది నిందితులను కోర్టు మెట్లు ఎక్కింది. వీరిలో ఆరుగురికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే తర్వాత వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.
కొంతకాలానికి ముఖ్తార్ మాయ్ అంతర్జాతీయ న్యాయవాదిగా మారి మహిళల హక్కుల కోసం పోరాటానికి శ్రీకారం చుట్టింది. తన సొంతూరు మీర్వాలాలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కష్టాల్లో ఉన్న మహిళలకు ఆశ్రయం కల్పిస్తోంది. గ్రామాల్లో బాలికలకు చదువు చెప్పిస్తోంది. డిజైనర్ రోజినా మునీబ్ విజ్ఞప్తి మేరకు ఆమె బుధవారం ఫ్యాషన్ షోలో పాల్గొంది.
'నాలాంటి అభాగ్యురాళ్ల గొంతుక కావాలన్నదే నా లక్ష్యం. మనం బలహీనులం కాదని నా సోదరీమణులకు చెప్పదలచుకున్నాను. మనకు హృదయం, మెదడు ఉంది. మనం కూడా ఆలోచించగలం. మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోరాటం చేయండి. అంతేకానీ ఆశ వదులుకోకండి. ఏదోకరోజు తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను ఫ్యాషన్ షోలో పాల్గొనడం వల్ల ఒక్క మహిళకు ప్రయోజనం కలిగినా ఎంతో సంతోషిస్తాన'ని ముఖ్తార్ మాయ్ చెప్పింది.