జర్మనీలో కూడా బురఖా నిషేధం!
బెర్లిన్: పశ్చిమ యూరప్ దేశమైన జర్మనీలో ముస్లిం మహిళలు ధరించే బురఖాను నిషేధించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. జర్మనీ లాంటి ఓపెన్ సొసైటీలో ముఖానికి కళ్లు మాత్రమే కనిపించే బురఖాలెందుకని జర్మనీ హోమ్ శాఖ మంత్రి థామస్ డీ మైజిరి శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. బురఖా ధరించడంపై నిషేధం విధించేందుకు జర్మనీ రాజ్యాంగం అనుమతిస్తుందా, లేదా అన్న అంశాన్ని అధికారులు తాజాగా పరిశీలిస్తున్నారు. లేదంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
‘మనం సామరస్యపూర్వక సమాజంలో నివసిస్తున్నాం. ముఖాలు ముఖాలు చూసుకొంటూనే పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. అలాంటప్పుడు ఒక్క బురఖానే కాదు, ఏ వస్త్రంతో కూడా ముఖాన్ని మూసుకునేందుకు ప్రయత్నించకూడదు. ప్రతి ఒక్కరు తమ ముఖాలను బహిర్గతం చేయాల్సిందే’ అని మంత్రి థామస్ చేసిన వ్యాఖ్యలు బురఖా నిషేధంవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని సూచిస్తున్నాయి.
ప్రదర్శనలు, ఆందోళనల సందర్భంగా నిరసనకారులు ముఖాలు కనిపించకుండా ఎలాంటి ముసుగులు ధరించకూడదనే నిషేధం జర్మనీలో ఇప్పటికే అమల్లో ఉంది. విద్యా సంస్థలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖాలకు బురఖాలు ధరించరాదని ఛాన్సలర్ ఆంజెలా మెర్కెల్ పాలకపక్ష సభ్యులు ఇప్పటికీ ప్రతిపాదనలు చేశారు. జర్మనీ సహా పలు యూరప్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.