సాక్షి, అమరావతి : అమెరికా హెచ్1బీ వీసా అంటే ఆ క్రేజే వేరు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు.. మరోవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా హెచ్1బీ వీసాల కోసం భారతీయులు విపరీతంగా పోటీ పడుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసినవారిలో భారతీయులదే అగ్రస్థానం. హెచ్1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాజాగా ముగిసింది. ఇక లాటరీ విధానంలో వీసాలను జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి హెచ్1బీ వీసాల కోసం వచ్చిన రిజిస్ట్రేషన్ల వివరాలతో ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం..
- ఈసారి అమెరికాలో 2.75 లక్షల మంది హెచ్1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
- ఇందులో 68 శాతం భారతీయులవే. భారత్ మొదటి స్థానంలో ఉండగా 13.20 శాతం రిజిస్ట్రేషన్లతో చైనా రెండో స్థానంలో ఉంది.
- అమెరికాలో ఈ ఏడాది కొత్త నిబంధన విధించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆ దేశ కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్1బీ వీసా కోసం సిఫార్సు చేయాలి. ఇలా అమెరికన్ కంపెనీలు భారతీయ ఉద్యోగులనే ఎక్కువగా సిఫార్సు చేస్తున్నాయి.
- రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిని లాటరీ విధానంలో హెచ్1బీ వీసాలకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే 65 వేల హెచ్1బీ వీసాల కోసం లాటరీ ప్రక్రియ పూర్తయినట్టుగా యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
- అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసినవారికి ఈ ఏడాది అదనంగా 20 వేల హెచ్1బీ వీసాలు జారీ చేయనున్నారు. ఆ మొత్తం లాటరీ ప్రక్రియ పూర్తి చేసి అర్హులను త్వరలో ప్రకటిస్తారు.
- అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. అప్పటికి హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ పూర్తి చేస్తారు.
సింహభాగం భారతీయులకే..
అమెరికాలో ఉద్యోగాలు, అక్కడ స్థిరపడటం పట్ల భారతీయులకు ఎక్కువ ఆసక్తి. ఇక అమెరికన్ కంపెనీలు కూడా భారతీయ ఉద్యోగులను నియమించుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే భారతీయులు తెలివైనవారు, సృజనాత్మకత ఉన్నవారు. అంతేకాకుండా కష్టపడేతత్వం ఎక్కువ. అందుకే ఆ దేశ కంపెనీలు భారతీయులకు ఎక్కువగా అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకే హెచ్1బీ వీసాల్లో సింహభాగం భారతీయులకే దక్కుతున్నాయి.
–ప్రొఫెసర్ డి.ప్రసాదరెడ్డి, వీసీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం.
Comments
Please login to add a commentAdd a comment