ఆ లక్కీ డాటర్స్ తో లాటరీ తగిలింది!
ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ అదృష్ట లక్ష్మీ ఇంటికొచ్చినట్టేనని చాలామంది భావిస్తారు. మరీ అలాంటి ఇద్దరు అదృష్ట లక్ష్ములు అత్యంత అరుదుగా వచ్చే ఒకే తేదీన జన్మిస్తే.. అంతకంటే ఆ తల్లిదండ్రులకు ఆనందం ఏముంటుంది. ప్రస్తుతం అమెరికాలోని వాయవ్య మిచిగన్‌కు చెందిన చాడ్, మెలిస్సా క్రాఫ్ దంపతులు ఇదే ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు.
ఈ దంపతులకు ఫిబ్రవరి 29 (లీపు సంవత్సరం) తెల్లవారుజామున 3.06 గంటలకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. వాస్తవానికి గర్భవతి అయిన మెలిస్సా క్రాఫ్ పదిరోజుల ముందే ప్రసవం కావాల్సి ఉంది. ప్రవసం ఆలస్యం కావడంతో నాలుగేళ్లకు ఓసారి వచ్చే లీపు సంవత్సరం రోజున ఆమె 'ఎవన్లీ జాయ్' అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకా అద్భుతమేమిటంటే సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే తేదీన ఆమె తన మొదటిబిడ్డకు జన్మనివ్వడం. ఈ దంపతుల పెద్దబిడ్డ ఎలియానా ఆడాయా 2012 ఫిబ్రవరి 29న.. అంటే లిపు సంవత్సరం నాడే జన్మించింది.
'ఇది నిజంగా నమ్మశక్యంగా అనిపించడం లేదు. పెద్ద లాటరీ తగిలినట్టు అనిపిస్తోంది. బేబీ లాటరీ మమ్మల్ని వరించింది' అని తల్లి మెలిస్సా ఆనందం వ్యక్తం చేసింది. పెద్దగా ప్రసవ వేదన పడకుండా, ఔషధాలు, సీజేరియన్ లేకుండా ప్రశాంతంగా ప్రసవం జరిగిందని ఆమె తెలిపింది. శనివారం పెద్ద కూతురు ఎలియానా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఆమె బంధువులు కూడా ఇది నిజంగా లాటరీ తగలడమే అంటున్నారు. నాలుగేళ్లకోసారి అది కూడా ఇద్దరు కూతుళ్ల బర్త్ డే ఒకేసారి చేయడమంటే లాటరీ తగలడమే కాదా? అని చమత్కరిస్తున్నారు. నిజానికి తోబుట్టువులు ఒకే తేదీన పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుంది. 1952-60 మధ్యకాలంలో కేవలం ఐదుగురు తోబుట్టువులు మాత్రమే ఒకే తేదీన జన్మించినట్టు గిన్నిస్ రికార్డులు చెప్తున్నాయి.