జర్మనీ చాన్స్‌లర్‌గా మళ్లీ మెర్కెల్
బెర్లిన్: జర్మనీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ దేశ చాన్స్‌లర్‌గా ఏంజెలా మెర్కెల్(59) మంగళవారం వరుసగా మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించారు. యూరోప్‌లోనే పెద్దదైన ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ.. చాన్స్‌లర్ ఎన్నిక విషయంలో గత కొన్ని నెలలుగా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన సంప్రదాయవాద క్రిస్టియన్ డెమోక్రాట్స్ యూనియన్ (సీడీయూ) గెలిచినప్పటికీ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో అప్పటినుంచి ప్రతిపక్ష సోషల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎస్‌పీడీ) మద్దతు కోసం చర్చలు జరిపి.. ఎట్టకేలకు ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో జర్మనీ పార్లమెంట్ దిగువ సభ బుందెల్‌స్టగ్‌లోని 631 సీట్లలో ఆ కూటమికి 504 స్థానాల భారీ మెజారిటీ లభించినట్లైంది. మంగళవారం సభలో జరిగిన విజయ నిర్ధారణ ఓటింగ్‌లో ఆమెకు 462 మంది ఎంపీల మద్దతు లభించింది.
సభకు హాజరైన 621 మంది సభ్యుల్లో 150 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేయగా, తొమ్మిదిమంది గైర్హాజరయ్యారు. జర్మనీ అధ్యక్షుడు జాచిమ్ గాక్‌తో ఆయన రాజప్రాసాదంలో సమావేశమైన తరువాత మెర్కెల్ చాన్స్‌లర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె నాలుగేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. గత ప్రభుత్వ కఠిన ఆర్థిక క్రమశిక్షణ నూతన సంకీర్ణ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.