అమూల్యమైన ఫెరారీ కారు దొరికింది
సాక్షి, ప్రత్యేకం: ప్రపంచవ్యాప్తంగా ఫెరారీ కార్లుకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. క్రేజ్‌కు తగ్గట్లే ఆ కార్ల ధర ఆకాశాన్నంటుతుంది. ఫెరారీ కార్లలో అత్యంత అమూల్యమైనదిగా భావించే ఫెరారీ 365 జీటీబీ/4 కారును జపాన్‌లో కనుగొన్నారు. అదేంటి కనుగొనడం అంటున్నారు అనుకుంటున్నారా?.
ప్రపంచంలో పూర్తిగా అల్యూమినియం మెటల్ బాడీతో కార్లను తయారు చేసిన తొలి, ఆఖరి కంపెనీ ఫెరారీనే. 1969-1973ల మధ్య మొత్తం 1200 అల్యూమినియం మెటల్ బాడీ కార్లను తయారు చేయాలని నిర్ణయించింది ఫెరారీ. అయితే, అనుకున్నవన్నీ సాధ్యపడవుగా. ఐదు కార్లు తయారు చేసిన తర్వాత ఆ ఆలోచనను ఉన్నట్లుండి విరమించుకుంది.
అలా అల్యూమినియం బాడీతో తయారైన కార్లలో నాలుగు రేసింగ్‌లకు వినియోగిస్తుండగా.. ఫెరారీ 365 జీటీబీ/4ను మాత్రం మామూలు వాడకానికి ఫెరారీ కంపెనీ అమ్మింది. ఈ కారుకు ఉన్న ముద్దు పేరు 'డేటోనా'. దీన్ని జపాన్‌కు చెందిన ఓ డీలర్ 1971లో షిప్పింగ్ చేయించుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికి పలువురు ఓనర్ల చేతులు మారుతూ ఎక్కడ ఉందో కూడా ఆచూకీ తెలియకుండా పోయింది.
తాజాగా దీన్ని జపాన్‌లోని ఓ కార్ షెడ్‌లో గుర్తించారు. ఇప్పటికీ తన సామర్ధ్యాన్ని కోల్పోని 'డేటోనా'.. కేవలం 22 వేల మైలేజ్ మాత్రమే నడిచింది. ఇప్పటికిప్పుడు డేటోనాను అమ్మకానికి పెడితే దాదాపు రూ.12 కోట్ల 79 లక్షల పలుకుతుందని అంచనా. కొత్త ఫెరారీ కార్లతో పాటు దీన్ని కూడా వేలం వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కార్ల ప్రేమికులు భారీ సంఖ్యలో హాజరవుతారని సమాచారం.