రియాద్(సౌదీ అరేబియా): అరబ్ దేశం సౌదీ అరేబియాలో మహిళలు వాహనాల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధం తొలగిపోయింది. ఈ మేరకు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజిజ్ అల్ సౌద్ చారిత్రక డిక్రీ వెలువరించారు. దీని ప్రకారం దేశ మహిళలు 2018 జూన్ నుంచి తమ వాహనాన్ని తామే డ్రైవ్ చేసుకునే వీలుంటుంది. ఈ నిర్ణయంపై సౌదీ అరేబియాతోపాటు ఇతర దేశాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు దేశంలో మగవాళ్లకు మాత‍్రమే అధికారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసేవారు. మహిళలు డ్రైవ్ చేస్తే మాత్రం అరెస్టు చేసి, జరిమానా వసూలు చేసేవారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన మనల్ అల్ షరీఫ్ అనే మహిళ కూడా జరిమానా చెల్లించారు.
అనంతరం ఆమె వుమెన్2డ్రైవ్ అనే పేరుతో ఆన్‌లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవ్ చేసే హక్కు కల్పించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, పలువురు మద్దతు కూడగట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఆమె ట్విటర్‌లో ‘సౌదీ అరేబియా నెవర్ బీ ద సేమ్ ఎగైన్’ అంటూ స్పందించారు. రియాద్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. మహిళల హక్కుల కోసం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయంగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్ తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులను కాదని 2014లో తన వాహనం నడుపుకుంటూ వెళ్లిన లౌజయిన్ అల్ హత్‌లౌల్ 73 రోజుల జైలు శిక్ష అనుభవించారు. ఈమె కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా సౌదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎన్నో ఏళ్లుగా సౌదీ మహిళలు కొనసాగిస్తున్న పోరాటానికి తగిన ఫలితం ఎట్టకేలకు లభించిందని ఆ సంస్థ అధికారి ఫిలిప్ లూథర్ తెలిపారు. అయితే, సౌదీ అరేబియాలోని సంప్రదాయ వాదులు మాత్రం రాజు తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. షరియా చెప్పిన దాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ‘షరియా ప్రకారం మహిళలు డ్రైవ్ చేయటం నిషిద్ధం. అలాంటి విషయంలో ఇప్పుడు అకస్మాత్తుగా అనుమతి ఎలా లభిస్తుందని ఓ విమర్శకుడు ట్వీట్ చేశారు.