లైంగిక ఆరోపణలు.. పరారీలో దర్శకుడు
పుణే: హీరోయిన్ కావాలన్న కల సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానన్న ఓ దర్శకుడు బదులుగా తన కోరికను తీర్చమంటూ(కాస్టింగ్ కౌచ్) ఆమెను వేధించాడు.
పుణేకు చెందిన అప్పా పవార్ అనే దర్శకుడు కలేవాడిలో చిరాగ్ పేరిట ఓ స్టూడియోను నడుపుతూ సినిమాలు తీస్తుంటాడు. తాజాగా తాను తీయబోయే సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. ఎప్పటి నుంచో హీరోయిన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కొరియోగ్రాఫర్ యువతి వారిని సంప్రదించింది. స్క్రీన్ టెస్ట్ కోసం వెళ్లినప్పుడు దర్శకుడితోపాటు ఇద్దరు నిర్మాతలు అక్కడ ఉన్నారు. మళ్లీ ఆగస్టు 6న రావాలంటూ ఆమెను పంపించేశారు. ఈసారి వెళ్లినప్పుడు అక్కడ పవార్, అతని అసిస్టెంట్ ఆకాశ్ మాత్రమే ఉన్నారు.
'మా సినిమాలో నటించే ఛాన్స్ కోసం నయా పైసా కూడా చెల్లించక్కర్లేదని ఆకాశ్ చెప్పాడు. అయితే ఓ పని చేయాలంటూ దర్శకుడి గదిలోకి నన్ను పంపాడు. అక్కడ పవార్ ఒక్కడే ఉన్నాడు. తాను తీయబోయే తర్వాతి రెండు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నన్నే తీసుకుంటానని, ప్రతిగా తనకు పడక సుఖాన్ని అందించాలని కోరాడు. అందుకు నేను నిరాకరించి బయటకువచ్చేశాన'ని బాధితురాలు వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న దర్శకుడు పవార్ కోసం గాలిస్తున్నామని ఎస్సై సంగీత గోడే తెలిపారు.