చిన్నారికి పెద్ద సలహా!
హర్షాలీ మల్హోత్రా... ఒకే ఒక్క చిత్రంతో బాలీవుడ్‌లో ఈ చిన్నారి అందరి దృష్టినీ ఆకర్షించేసింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్ రంగీ భాయిజాన్’లో మాటలు రాని అమ్మాయి షాహిదా అలియాస్ మున్నీగా హర్షాలీ అభినయం సూపర్బ్. ఇప్పుడీ క్రేజీ బాలతారకు బోల్డెన్ని అవకా శాలు వస్తున్నాయట. దాంతో హర్షాలీ తల్లికి సల్మాన్ ఓ సలహా ఇచ్చారట.
ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయిస్తే, వచ్చిన క్రేజ్ పోతుందని ఈ కండలవీరుడు అన్నారట. ఈ సంగతి హర్షాలీ తల్లి కాజల్ మల్హోత్రా స్వయంగా చెప్పారు. ‘బజ్‌రంగీ...’ విడుదలయ్యాక సల్మాన్‌ని, దర్శకుడు కబీర్ ఖాన్‌ను కాజల్ కలిశారట. అప్పుడు సల్మాన్ ఈ సలహా ఇచ్చారట. ఆ వివరాలు కాజల్ చెబుతూ -‘‘హర్షాలీలో మంచి నటి ఉందని సల్మాన్ మెచ్చుకున్నారు.
మొదటి సినిమాకు వచ్చిన పేరు నిలబడాలంటే తర్వాతి చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేయాలని సల్మాన్ అన్నారు. కథకు కీలకంగా లేని చిన్న చిన్న పాత్రలకు పరిమితం కాకూడదని జాగ్రత్తలు చెప్పారు. సల్మాన్ భాయ్ చెప్పింది దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఎంపిక చేసుకుంటాం’’ అని అన్నారు.