రజనీకి రాజకీయాల్లోకొచ్చే ఆలోచనుందా?
తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పొత్తుల కోసం పావులు కదుపుతున్నాయి. మరో పక్క గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ సారి హోరాహోరీ పోరు అనివార్యం కావడంతో ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోరాదని భావిస్తున్నారు. సినీ గ్లామర్ను వాడుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే కొందరు నటీనటులు రాజకీయ ప్రవేశం చేసి ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను రాజకీయాల్లోకి లాగాలన్న ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతున్నాయి. రజనీ కూడా దేవుడు ఆదేశిస్తే తాను పాటిస్తాను వంటి డైలాగులతో అభిమానులను ఊరిస్తూ వస్తున్నారు. బీజేపీకి రజనీ మద్దతు ఇస్తారని, ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ఇటీవల వచ్చిన వార్త ఇతర పార్టీల నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే రజనీకి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన సోదరుడు సత్యనారాయణ చెప్పారు. ఈ నేపథ్యంలో రజనీకి రాజకీయాల్లోకొచ్చే ఆలోచన ఉందా? లేదా? అన్నది ఎప్పటిలాగే సస్పెన్స్గా మారింది.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్రిష్ణగిరి వచ్చిన సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 'రజనీకి రాజకీయాలు వద్దు. రజనీకి తమిళనాడే అంతా. తమిళ ప్రజలు ఆయనకు ప్రాణం. తమిళనాడు, ఇక్కడి ప్రజలు బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. రజనీ సంతోషంగా ఉంటే చాలు. ఆయన్ను రాజకీయాల్లోకి లాగకండి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రజనీ అభిమానులు వారికి నచ్చిన పార్టీకి ఓటు వేయచ్చు. రజనీకి రాజకీయ పార్టీ ప్రారంభించే ఆలోచన ఈ రోజు వరకూ లేదు. ఎవరు అధికారంలోకి వస్తే మంచి చేస్తారో ప్రజలకు బాగా తెలుసు' అని సత్యానారాయణ చెప్పారు. ఎన్నికల అనంతరం రజనీ చిత్రం కబాలి విడుదల అవుతుందని తెలిపారు.