సమంతా.. ఈ చర్యలేల?
చెన్నై: నటి సమంత '10 ఎండ్రదుకుళ్' చిత్రంపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. విడుదలకు ముందు ఆ చిత్రం గురించి చాలా ఎక్కువే ప్రచారం చేసుకుంది. విక్రమ్ సరసన నటించిన ఆ చిత్రం విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేదు కదా సమంతకు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టింది. ఒక పక్క చిత్రం నిరాశపరిచిన ఊరకుండకుండా సమంత ఆ చిత్రంలో చుట్ట తాగే ఫొటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దారిన పోయేదాన్ని తలకు చుట్టుకున్నట్లు ట్విట్టర్‌లోని చుట్ట పీల్చే ఫొటోలను చూసిన హిందు మక్కల్ కచ్చి కార్యకర్తలు సమంత చర్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆమె బేషరత్తుగా క్షమాపణ చెప్పకుంటే ఇంటిని చుట్టుముట్టి ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు చేశారు. దీని గురించి ఆ పార్టీ రాష్ట కార్యదర్శి వీరమాణిక్యం శివ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ పొగతాగడం వల్ల మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ గురవుతున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పొగ తాగడం హానికరమంటూ పలు విధాలుగా ప్రచారం చేస్తోంది. కాని సమంత లాంటి వాళ్లు భావితరాలను పొగతాగే విధంగా ఉసుగొలుపుతున్నారని ఆరోపించారు.
సమంత తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చుట్ట తాగే ఫొటోలను వెంటనే తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమెకు పొగాకు ప్యాకెట్లను పోస్ట్ ద్వారా పంపుతామని అవసరం అయితే సమంత ఇంట్టిని చుట్టు ముట్టి ఆందోళనకు దిగడానికి వెనుకాడమని హెచ్చరించారు.