రాజమౌళి ప్రభావం లేదు
- దర్శకుడు జగదీశ్ తలశిల
‘‘మద్రాసు యూనివర్శిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన నేను గుణ్ణం గంగరాజుగారి ‘అమృతం’ సీరియల్‌కు పనిచేశా. ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటి, రాజమౌళి గార్ల వద్ద పనిచేశాను. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’తో దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టా’’ అన్నారు దర్శకుడు జగదీశ్ తలశిల. మయూఖ క్రియేషన్స్ పతాకంపై నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ జంటగా ఆయన దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ చిత్రాలకు రాజమౌళి గారి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. దీంతో అందరూ ఈ సినిమాపై ఆయన ప్రభావం ఉంటుందని అనుకుంటారు.
కానీ అటువంటిదేమీ లేకుండా జాగ్రత్త పడ్డాను. ఈ చిత్రం కథ మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. బ్యాంకుల్లో వాడకంలో లేని కొన్ని వేల కోట్ల రూపాయలున్నాయి. ఇలా అనాథగా పడి ఉన్న డబ్బు గురించి ఎంటర్‌టైనింగ్‌గా చెప్పా. ఇందులో హీరో, హీరోయిన్ ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. మొత్తం కథ విన్న తరువాతే కీరవాణిగారు సంగీతం చేయడానికి ఒప్పుకున్నారు. నవంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం, కానీ గ్రాఫిక్ వర్క్‌తో లేటయింది. ఈ చిత్రం రిలీజ్ తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేదానిపై నిర్ణయం ఉంటుంది’’ అని తెలిపారు.