స్త్రీలు చూడాల్సిన చిత్రం ప్రభ
చిత్రాల నిర్మాణం అన్నది ప్రవాహం లాంటిది. ఇప్పుడు వారానికి నాలుగైదు చిత్రాలు తెరపైకి వస్తున్నాయి. అయితే వాటిలో విజయం సాధించేది కొన్నే. అందులోనూ కాస్త సందేశంతో కూడిన ప్రయోజనకరమైన చిత్రాలు చాలా తక్కువగానే చెప్పాలి. అలా ఒక చక్కని ఇతివృత్తంతో కమర్షియల్ అంశాలు జోడించి రూపొందిస్తున్న చిత్రం ప్రభ అంటున్నారు. ఆ చిత్ర దర్శక నిర్మాత నందన్. దర్శకుడు ధరణి వద్ద శిష్యరికం చేసిన ఈయన తమిళ తిరై పతాకంపై సొంతంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విజయ్‌రామ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో పలువురు నూతన తారాగణం నటిస్తున్నారు. రజనిపాణి, ఎస్.మురుగన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌జే జనని సంగీతాన్ని అందిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ ప్రభ మహిళ ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం అన్నారు. స్త్రీలు, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం ఇదని అన్నారు. స్త్రీలు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఇతరుల సాయం కోరుతారన్నారు. అలా కాకుండా తమ సమస్యలను తామే ఎదుర్కొని పోరాడి గెలవాలని చెప్పే చిత్రం ప్రభ అని అన్నారు. నటి స్వాశిక నవనాగరికత మహిళకు ప్రతినిధిగా ప్రధాన పాత్రలో నటించారని, చిత్రంలో సాహసోపేతంగా ఫైట్స్ కూడా చేశారని తెలిపారు. ఈ చిత్రం ఆమెతో పాటు యూనిట్ అందరికీ టర్నింగ్ ఇచ్చేదిగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.