ప్రారంభమిక్కడ..పేరొచ్చిందక్కడ.. | Model And Actor Mahesh Sriram Special Chit Chat | Sakshi
Sakshi News home page

ప్రారంభమిక్కడ..పేరొచ్చిందక్కడ..

Published Mon, Feb 25 2019 9:13 AM | Last Updated on Mon, Feb 25 2019 9:13 AM

Model And Actor Mahesh Sriram Special Chit Chat - Sakshi

నగర వీధుల్లో నర్తించిన టీనేజ్‌ కుర్రాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. రామకృష్ణ మఠంలో తను గీసిన చిత్రాలు ప్రదర్శిస్తే ఆనందంతో పొంగిపోయిన అదే కుర్రోడు ఇప్పుడు యానిమేషన్‌ కోర్సులో ఎందరినో తీర్చిదిద్దుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ మోడల్‌గా, నటుడిగా, యానిమేషన్‌ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న మహేష్‌ శ్రీరామ్‌ ఇటీవల సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాల కథామాలిక ఇదీ..

తెలుగువాళ్లు అరుదే..
మరే రంగంలోనైతే ఏమో గానీ.. అంతర్జాతీయంగా మోడలింగ్‌ రంగంలో మాత్రం రాణిస్తున్న భారతీయులు అందునా తెలుగువాళ్లు అంటే దాదాపు అరుదే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో నగరం నుంచి అమెరికా వెళ్లిన నేను అనూహ్యంగా ప్రొఫెషనల్‌ మోడల్‌ కావడం యాదృచ్ఛికమే.  

ప్రారంభమిక్కడ..పేరొచ్చిందక్కడ..
హైట్, లుక్స్‌తోనో, ఇతరులు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తోనో చిన్నప్పటి నుంచీ గ్లామర్‌ ఫీల్డ్‌ నాకు ఎంతగానో ఇష్టం. హైదరాబాద్‌ గల్లీల్లో తిరుగుతున్నప్పుడు హాలీవుడ్‌ అంటే ఒక డ్రీమ్‌. హిమాయత్‌నగర్‌లో ఉంటూ చదువుతుండగానే మోడలింగ్‌ అవకాశాలు వినియోగించుకున్నా. చెప్పుకోదగ్గ సంఖ్యలో ర్యాంప్‌షోస్, ఫొటో షూట్స్‌ చేశా. ఆ తర్వాత ఉన్నత చదువుల బిజీలో మోడలింగ్‌ పక్కన బెట్టి కెరీర్‌ వేటలో మునిగిపోయా.  ఉద్యోగరీత్యా లండన్, అక్కడి నుంచి అమెరికాకి షిఫ్టయ్యా. అదే సమయంలో అనుకోని రీతిలో వచ్చింది ఇండియన్‌ కంపెనీ హిమాలయా స్వీట్స్‌ నుంచి ఆఫర్‌. ఒక వేడుకలో నన్ను కలిసిన ఇండియన్స్‌... నా గురించి తెలిసి తమ యాడ్‌లో చేయమని ఇచ్చిన అవకాశం నచ్చి సరదాగా ఒప్పుకొన్నాను. అది నాలో మళ్లీ గ్లామర్‌ ఫీల్డ్‌పై ఆసక్తి రేపింది. ఆ యాడ్‌ తర్వాత ఒక్కొక్కటిగా అవకాశాలొచ్చాయి. అమెరికాలో 14 ఏళ్లుగా ఉంటున్నా మోడల్‌ కెరీర్‌ ఊపందుకుంది గత ఆరేళ్ల నుంచే. వెరిజోన్, ల్యాంగార్డ్, హోమ్‌డిపో, డెల్‌ ఇంటర్నేషనల్, లింక్డిన్, లిప్టన్‌ ఐస్‌ టీ, జీఎంసీ డెనాలి, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తదితర పేరొందిన సంస్థలన్నింటికీ పనిచేశా.

ఇంటర్నేషనల్‌.. పక్కా ప్రొఫెషనల్‌..
అంతర్జాతీయ స్థాయిలో రూపొందే యాడ్స్‌కు అన్నీ పక్కా ప్రొఫెషనల్‌గా ఉంటాయి. హాలీవుడ్‌ అడ్వర్టయిజింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌.. కంపెనీని బట్టి.. ప్రాజెక్ట్‌ని బట్టి ఆడిషన్స్‌  రెజ్యూమ్స్, పోర్ట్‌ ఫోలియోలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత.. మోడల్స్‌ని ఎంపిక చేస్తారు. ఒక్కోసారి ఫ్రెషర్స్‌కి కూడా అవకాశాలున్నా.. పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది. చాలా త్వరగా 2 నుంచి 3 రోజుల్లోనే యాడ్‌ షూట్‌ అయిపోతుంది. ప్రతి కొత్త ప్రాజెక్ట్‌కి ముందు వర్క్‌షాప్స్‌ ఉంటాయి. ప్రాజెక్ట్‌ వారీగా చెల్లింపులు ఉంటాయి. విభిన్న ప్రాంతాల, దేశాల, నేపథ్యాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్నవారితో  కలిసి పని చేయడం మంచి అనుభవం. మనకీ వాళ్లకీ ఒక్క విషయంలో మాత్రం పూర్తి సారూప్యత ఉంటుంది. అది అమ్మాయిలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం (నవ్వుతూ).

సినిమాలకూ సై...
మోడలింగ్, సినిమా ఇవన్నీ ఒకదానికొకటి అనుబంధంగా సాగేవే. కొన్ని పెద్ద ఆఫర్లు వచ్చినా.. నేను తటపటాయించాను. దానికి సొంత యానిమేషన్‌ కంపెనీ ‘పిక్సెల్‌’ను ప్రారంభించడం ఓ కారణం. అమెరికాలో షూట్‌ చేసిన చిన్న సినిమా అనే తెలుగు సినిమాలో నెగిటివ్‌ రోల్‌ చేశాను. అదే విధంగా మరికొన్ని సినిమాల్లో కూడా చేశాను. ప్రస్తుతం అక్కడ టీవీ సిరిస్‌లో కూడా నటిస్తున్నాను. ఏదైనా మంచి ఆఫర్‌ వస్తే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ సినిమాల్లో తప్పకుండా నటిస్తా.

రేసిజం.. ఎదురవలేదు..  
హై ఎండ్‌ రెస్టారెంట్స్, రియల్‌ ఎస్టేట్, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్, ఐటి కంపెనీలు... ఇలా ఎన్నో చేశాను.చేసిన యాడ్స్‌ చాలా వరకూ కూల్, జంటిల్‌గా ఉంటాయి. దీనికి కారణం..యాడ్‌లో మహేష్‌ శ్రీరామ్‌ని మాత్రమే కాక ఒక భారతీయుడిని ప్రతిబింబిస్తున్నానని నేననుకుంటా. ‘హే యూ నో హీ ఈజ్‌ ఇండియన్‌ మోడల్‌’ అని అంటుంటే... చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. రేసిజం గురించి కొందరు అడిగారు కాని ఇప్పటిదాకా నాకేరకమైన చేదు అనుభవాలు లేవు. అక్కడ జరిగే స్థానిక భారతీయ అందాల పోటీలకు జడ్జిగా వెళుతున్నాను. చారిటీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. స్వచ్చభారత్‌కి నిధుల సేకరణ నిమిత్తం
నిర్వహించిన కార్యక్రమం సహా పలు సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకున్నాను.

స్ఫూర్తినిచ్చి.. చేయూతగా నిలిచి..  
యువతను తీర్చిదిద్దడం, వారికి మార్గదర్శకత్వం వహించడం అంటే చాలా ఇష్టం నాకు. నా వరకూ వస్తే నేనొక సగటు మనిషిని. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయినప్పటికీ.. నా పేషన్‌ మాత్రమే నన్ను కెమెరా ముందు నిలబెడుతోంది. ఓ కంపెనీ అధినేతగా కొనసాగేలా చేస్తోంది. ఇక్కడి నుంచి ఎవరు మోడలింగ్‌ సహా అంతర్జాతీయంగా ఏ రంగంలో రాణించాలన్నా నావంతు సహకారం అందిస్తా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement