అనుష్క
అనుష్క అసలు పేరు స్వీటీ. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఆ పేరు మారింది. కానీ మనిషి మాత్రం స్వీట్‌గానే ఉన్నారు. ‘నిజంగానే స్వీట్ పర్సన్’ అని ఇండస్ట్రీలో అంటారు. ఇంకో సంవత్సరంలో స్వీటీ స్వీట్ సిక్స్‌టీన్ ఇయర్స్‌కి చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి. అవును.. హీరోయిన్‌గా అనుష్క ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లవుతోంది. ఈ సందర్భంగా స్వీట్‌గా ‘సాక్షి’తో పలు విశేషాలు పంచుకున్నారు అనుష్క.
► ‘భాగమతి’ తర్వాత ‘నిశ్శబ్దం’తో మళ్లీ స్క్రీన్ మీద కనిపించడానికి రెండేళ్లు పట్టింది. ఎందుకీ గ్యాప్?
‘బాహుబలి, రుద్రమదేవి’ సినిమాలు శారీరకంగా చాలా కష్టంతో కూడుకున్నవి. ఆ షూటింగ్ సమయాల్లో గాయపడ్డాను. ఆ గాయాలు మానడానికి బ్రేక్ తీసుకున్నాను.
► హీరోయిన్‌గా 15 ఏళ్లు పూర్తవడం గురించి?
15 ఏళ్లు ఎలా గడిచాయో తెలియలేదు. అయితే ఆ పదిహేనేళ్లదే ప్రపంచం కాదు. మనకి మనం కొంత సమయం కేటాయించుకోవాలి. రియాలిటీ చెక్ చేసుకోవాలి. అందుకే ఇప్పటినుంచి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను.
► ఈ బ్రేక్‌లో బరువు తగ్గుతున్నట్లున్నారు?
మెల్లిగా తగ్గుతూ వస్తున్నాను. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గుతున్నాను.
► లావు, సన్నం, తెలుపు, నలుపు.. ఇలా చాలా మంది బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లనిపిస్తోంది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా...
(మధ్యలో అందుకుంటూ).. నిజమే ఇప్పుడు ఎవర్ని కలిసినా ఎలా ఉన్నావు? ఆరోగ్యం బావుందా? అని అడగడం మానేసి సన్నబడ్డా వేంటి? లావయ్యావేంటి? అని అడుగుతున్నారు. లేకపోతే నల్లబడ్డావంటారు. ప్రస్తుతం అందరం పైపై విషయాల్నే గమనిస్తున్నాం కానీ లోపల వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారో పట్టించుకోవడం లేదు. ఎవరు ఎవర్ని కలిసినా ముందు ఇలాంటి విషయాల గురించి కాకుండా హ్యాపీగా ఉన్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? అని అడగాలి. కానీ ఫిజికల్ అపియరెన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ఎక్కువమంది మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కి గురవడానికి కారణాలివే. మనం ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించాలి. ఎదుటివాళ్లను కూడా అంగీకరించాలి. పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇచ్చి మన ఒరిజినాల్టీని కోల్పోకూడదు.
► ‘బాహుబలి, రుద్రమదేవి’ ఎక్కువ ఫిజికల్ వర్క్ అన్నారు. ‘నిశ్శబ్దం’లో మూగ, చెవిటి అమ్మాయి సాక్షిగా నటించారు. వరుసగా చాలెంజింగ్ రోల్స్ చేయడం ఎలా అనిపిస్తోంది?
‘నిశ్శబ్దం’ కథను కోన వెంకట్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు ఎదురైన పెద్ద చాలెంజ్ ఏంటంటే తెలుగులో డైలాగ్స్ ఎలా చెప్పాలి అని. ఇప్పుడు డైలాగ్స్ లేకుండా నటించాను (నవ్వుతూ). ఈ పాత్ర కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ముందు ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌తో చేయాలనుకున్నాం. కానీ కథ అమెరికాలో ఉంటుంది. దాంతో అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లో చేశాం.
► ఈ ఇయర్ మీ పెళ్లి అంటున్నారు. ఎవరో క్రికెటర్‌తో అని, ఓ దర్శకుడి కుమారుడితో అనీ వార్తలు...
అవును.. నాకు పెళ్లి అంటున్నారు. నాక్కూడా తెలియదు (నవ్వుతూ). ప్రేమ అయినా పెళ్లి అయినా ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒకవేళ నేను రిలేషన్‌షిప్‌లో ఉంటే దాన్ని సీక్రెట్‌గా దాచను. పదేళ్ల నుంచి ప్రతీ మూడు నాలుగు నెలలకోసారి నాకు పెళ్లి చేస్తూనే ఉన్నారు. నేను వార్తలు చూడను, పేపర్ చదవను. బయట ప్రపంచాన్ని ఫాలో అవ్వను. నా పని పూర్తయ్యాక కటాఫ్ అయిపోతాను. నీ గురించి ఇలాంటి ఒక వార్త వచ్చిందని నాకు ఎవరో చెబుతారు. క్రికెటర్‌ని పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తను దర్శకుడు హేమంత్ చెప్పారు. అప్పుడెలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఒకరి పర్శనల్ విషయాల గురించి ఉన్నవీ లేనివీ కల్పించి ఎందుకు రాస్తారో తెలియదు. రాసేవాళ్లకూ ఫ్యామిలీ ఉంటుంది కదా. వాళ్ల గురించి అలా రాస్తే వాళ్లు ఫీల్ అవ్వరా?
► ‘సాహో’లో మిమల్ని ఒక స్పెషల్ సాంగ్ చేయమన్నారట?
అడిగారు. అప్పుడు నేను అమెరికాలో షూటింగ్ చేస్తున్నాను. షెడ్యూల్ కుదర్లేదు.
► డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంటరవుతారా?
నా ప్రాధాన్యం సినిమాలకే. సినిమా మ్యాజిక్ థియేటర్‌లోనే ఉంటుంది. ఒకవేళ అద్భుతంగా ఉందనిపిస్తే అప్పుడు డిజిటల్‌కి ఓకే చెబుతా.
► ఈ 15 ఏళ్లల్లో ఎన్నో మాస్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేశారు. ఇప్పుడు అది మిస్సవుతున్నట్లు ఉందా?
అవును. సెట్ సాంగ్స్ మిస్ అవుతున్నాను. మంచి మాస్ నంబర్‌కి డ్యాన్స్ చేసే క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. ఓ పక్కా కమర్షియల్ సినిమా చేయాలనుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేçస్తున్నప్పుడు కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ మూవీ చేసినప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే బాగుండు అనిపిస్తుంది. సినిమా మ్యాజిక్కే అది.
► నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాను. ఓ రెండు స్క్రిప్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. జూన్ నుంచి షూటింగ్స్ మొదలుపెడతాం.
– గౌతమ్ మల్లాది
Comments
Please login to add a commentAdd a comment