భార్య ఉద్యోగానికెళ్లాలి.. అప్పటికే సమయం మించిపోతుండటంతో భర్త ఆమెను రైలెక్కించడానికి బైక్‌పై తీసుకొచ్చాడు. ఇద్దరూ వడివడిగా టికెట్ కౌంటర్ వైపు వెళ్లారు. ఈ దృశ్యం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా చైతన్యం తీసుకొచ్చింది. అందరూ దానిపై దృష్టిసారించారు. కారణమేంటంటే.. వారిద్దరూ సమంత, నాగచైతన్యలు మరి. నిజజీవితంలో భార్యాభర్తలైన వారు సినిమాలోనూ దంపతులుగా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వేస్టేషన్‌లో జరుగుతుండగా ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు.
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సమయం ఉదయం సరిగ్గా పది గంటలు... డ్యూటీకి టైమైంపోతోందనే హడావిడిలో భార్య... హర్రీబుర్రీగా బైక్‌పై రైల్వేస్టేషన్‌కు డ్రాప్ చేసిన భర్త... ఉరుకులూ పరుగులతో స్టేషన్ బుకింగ్ కౌంటర్‌లోకి భార్య అడుగులు... అంతే షాట్ రెడీ... కట్ చేస్తే.. ఇదేంటని అనుకుంటున్నారా... ఔను గోపాలపట్నం సింహాచలం రైల్వేస్టేషన్‌లో సోమవారం హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంత సినిమా షూటింగ్ సందడి ఇది. పెద్ది హరీష్ నిర్వహణలో శివనిర్వాణ దర్శకత్వంలో ఇక్కడ స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంత సందడి జనాన్ని ఆకర్షించింది.
సమంత సింహాచలం రైల్వేస్టేషన్‌లో బుకింగ్ క్లర్క్‌గా, నాగచైతన్య ఆమెకు భర్తగా నటిస్తున్నారు. నాగచైతన్య ఆమెను రైల్వేస్టేషన్‌కు బైక్‌పై తీసుకురావడం, సమంత హుటాహుటిన టికెట్ కౌంటర్‌లోకి వెళ్లి టికెట్లు ఇవ్వడం.. వంటి సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. ఇదంతా పూర్తి కుటుంబ కథా చిత్రమని నిర్మాత పెద్ది హరీష్ తెలిపారు. నాగచైతన్య, సమంతకు వివాహం జరిగాక ఇది తొలిచిత్రంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను మొదట కృష్ణార్జునయుద్ధం చిత్రం తీశానని, ఇది రెండో చిత్రమని తెలిపారు. ఇక్కడి షూటింగ్ సందడి నెలకొనడంతో అది చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడ్డారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌మహంతి ఆధ్వర్యంలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్తున్న సమంత
Comments
Please login to add a commentAdd a comment