
ఆ ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు
కొన్ని హిట్ కాంబినేషన్స్‌ను అంత త్వరగా మరచిపోలేం.అలాంటి వారిలో దర్శకద్వయం శశికుమార్, సముద్రకని ఒకరు.
కొన్ని హిట్ కాంబినేషన్స్‌ను అంత త్వరగా మరచిపోలేం.అలాంటి వారిలో దర్శకద్వయం శశికుమార్, సముద్రకని ఒకరు. వీరిద్దరు కలిసి చేసిన సుబ్రమణియపురం చిత్రం తమిళ చిత్రపరిశ్రమ మరచిపోలేని చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. శశికుమార్ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలతో పాటు సముద్రకనితో కలిసి నటించిన ఆ చిత్రం 2008 విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత సముద్రకని దర్శకత్వంలో శశికుమార్ ఈశన్ చిత్రంలో హీరోగా నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత ఇద్దరు కలిసి నాడోడిగళ్ చిత్రానికి పని చేశారు. దీనికి శశికుమార్ హీరో, సముద్రకని దర్శకుడు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత వారిద్దరూ విడివిడిగానే పనిచేస్తున్నారు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత శశికుమార్, సముద్రకని కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి వెట్రివేల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వసంతమణి దర్శకత్వం వహించనున్న ఇందులో నాయకిగా మియాజార్జ్ నటించనున్నారు. ప్రభు ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో తంబిరామయ్య, రేణుక ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందన్నది కోలీవుడ్ సమాచారం.