కమలహాసన్,శ్రుతీహాసన్
తమిళసినిమా: తమిళ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కలకలం నటుడు కమలహాసన్ రాజకీయరంగప్రవేశం గురించే. బుధవారం ఆయన రాజకీయ పయనానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా మధురైలో తన పార్టీ పేరు, విధి విధానాలను వెల్లడించనున్నారు. దీంతో ఆయన రాజకీయ జెండా, అజెండా ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కమలహాసన్ తమిళనాడులోని ప్రముఖ రాజకీయనాయకులను కలిసి వారి ఆశీస్సులు, సూచనలను పొందుతున్నారు. ఒక్క అన్నాడీఎంకేకు చెందిన నాయకులను మినహా డీఎంకే అధినేత కరుణానిధి నుంచి రజనీకాంత్, విజయకాంత్‌ల వరకూ పలువురిని కలిశారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే కమల్ రాజకీయ పయనం గురించి ఒక్క చారుహాసన్ మినహా ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇప్పటి వరకూ స్పందించలేదు.
కమలహాసన్ సహోదరుడయిన చారుహాసన్ ఈ విషయమై తన అభిప్రాయాన్ని ఇటీవల వెల్లడిస్తూ కమల్ చాలా మంచి వ్యక్తి. తను రాజకీయాలకు సరిపడరు అని పేర్కొన్నారు. ఇప్పుడు కమల్ రాజకీయాల్లోకి పూర్తిగా దిగిపోవడంతో ఆయన వారసురాలు, క్రేజీ నటి శ్రుతీహాసన్‌కు ఇందులో పాత్ర ఏమిటీ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని గురించి శ్రుతీహాసన్ కూడా స్పష్టంగానే తన నిర్ణయాన్ని వెల్లడించారు. నాన్న రాజకీయరంగ ప్రవేశానికి నా శుభాకాంక్షలు. నాన్నను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతే కాదు ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుంది. అయితే రాజకీయాల్లో నాన్నతో కలిసి పయనించే అలోచన నాకు లేదు. అదే విధంగా నాకు షూటింగ్ ఉండటం వల్ల రామేశ్వరం, మధురైలో నాన్న నిర్వహించనున్న బహిరంగ సభల్లో నేను పాల్గొనడం లేదు అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment