యూపీ రెండో దశలో 65% పోలింగ్
ఉత్తరాఖండ్‌లో రికార్డు స్థాయిలో68%
లక్నో: ఉత్తరప్రదేశ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. యూపీలో తాజా విడతలో 65 శాతం పోలింగ్, ఉత్తరాఖండ్‌లో రికార్డు స్థాయిలో 68 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలోని బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ తదితర 11 జిల్లాల్లోని 67 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి, ఎస్పీ నేత ఆజం ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద సహా మొత్తం 721 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తల్లి కాజ్మీ(115) కుటుంబ సభ్యులతో కలసి బరేలీలో ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.2 శాతం పోలింగ్ నమోదైంది.
ఉత్తరాఖండ్‌లో 2 శాతం ఎక్కువ.. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో నమోదైన 68 శాతం పోలింగ్ 2012 ఎన్నికల నాటి పోలింగ్(66 శాతం) కంటే రెండు శాతం ఎక్కువ. రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పోలింగ్. రాష్ట్రంలోని మొత్తం 70 అసెంబ్లీల స్థానాలుండగా కర్ణప్రయాగ్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడంతో 69 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కర్ణప్రయాగ్‌లో మార్చి 9న ఎన్నికలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ రెండు స్థానాల(హరిద్వార్ రూరల్, కిచ్చా) నుంచి బరిలోకి దిగారు. ఓటు సరిగ్గా పడినట్లు ఓటరుకు ధ్రువీకరణ పత్రాలిచ్చే వీవీపీఏటీ యంత్రాలను తొలిసారి రాణిపూర్, ధరమ్‌పూర్, రుద్రపూర్‌లలో వినియోగించారు.