రాష్ట్రపతి ఎన్నికలో 99% పోలింగ్
► 20న కౌంటింగ్, ఫలితాలు
►పార్లమెంటు హాల్లో తొలి ఓటు వేసిన ప్రధాని
► యూపీలో కోవింద్‌కు ఓటేసిన ఎస్పీ నేత శివ్‌పాల్
► విజయంపై అధికార, విపక్షాల ధీమా
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతి ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్. ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. తృణమూల్ ఎంపీ తపస్ పాల్, బీజేడీ సభ్యుడు రాంచంద్ర హన్స్‌దక్, పీఎంకే సభ్యుడు అన్బుమణి రాందాస్ గైర్హాజరయ్యారు.
కాగా, అనారోగ్యం కారణంగా డీఎంకే చీఫ్ కరుణానిధి ఓటేయలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ చెన్నైలో వెల్లడించారు. 54 మంది ఎంపీలు వారి రాష్ట్రాల్లో ఓటేసేందుకు అనుమతి తీసుకున్నారు. సోమవారం పార్లమెంటు హాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారని మిశ్రా వెల్లడించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ షా కూడా ఢిల్లీలో ఓటువేశారు. జూలై 20 ఉదయం 11 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని.. ముందుగా పార్లమెంటు బ్యాలెట్ బాక్స్ లెక్కించిన తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాలనుంచి వచ్చిన బాక్సుల కౌంటింగ్ చేపట్టనున్నట్లు మిశ్రా తెలిపారు.
పలుచోట్ల క్రాస్ ఓటింగ్
యూపీలో సమాజ్‌వాద్ పార్టీ విపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపినప్పటికీ.. ఆ పార్టీ ముఖ్య నేత శివ్‌పాల్ యాదవ్.. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటేశారు. ‘కోవింద్‌కు నా సంపూర్ణ మద్దతుంది. మీరాకుమార్ తనకు ఓటేయమని నన్ను అడగలేదు. నేతాజీ (ములాయం) సూచనల మేరకే కోవింద్‌కు ఓటేశాను’ అని శివ్‌పాల్ స్పష్టం చేశారు. ఆయనతోపాటుగా ఒకరిద్దరు ఎస్పీ, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కోవింద్‌కు అనుకూలంగా ఓటేశారు. మణిపూర్‌తోపాటు పలు ఈశాన్యరాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు కూడా కోవింద్ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.
కోవింద్ విజయం ఖాయం: బీజేపీ
ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టమైన మెజారిటీతో ఘనవిజయం సాధిస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. ‘కోవింద్ తప్పనిసరిగా భారీ మెజారిటీతో గెలుస్తారు’ అని వెంకయ్య ఢిల్లీలో తెలిపారు. రాజ్యాంగం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా అత్యున్నత పదవికి కోవింద్ సరైన న్యాయం చేస్తారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన ఈ పోటీలో తమ అభ్యర్థిదే విజయమని కాంగ్రెస్ తెలిపింది.
ఈ ఎన్నికల్లో మీరాకుమార్‌దే విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. మీరాకుమార్ అసలైన రాజ్యాంగ పరిరక్షకురాలని సీపీఎం, సీపీఐ వ్యాఖ్యానించాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా దళిత నేతే రాష్ట్రపతి అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ‘దేశంలో జరుగుతున్న దానికి నిరసనగానే మీరాకుమార్‌కు మద్దతుగా ఇవాళ తృణమూల్ పార్టీ ఓటేస్తోంది’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.