గుండెల నిండా గాలి పీల్చుకోవాలంటే భయం.. ముఖానికి మాస్క్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే వణుకు.. ప్రాణాధారమైన వాయువే.. ఆయువు తీసేస్తుందేమోనన్న ఆందోళన.. ఎందుకో తెలుసా..? అంతా కాలుష్యం మరి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా జాబితా ప్రకారం.. భూమ్మీద వాయు కాలుష్యం అధికంగా ఉన్న 20 నగరాల్లో 14 భారత్‌లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే తెలిసిపోతుంది. మరి గాలిలో ఉండే కాలుష్యాలు ఏమిటి, ఏ కాలుష్యంతో ఏం ప్రమాదమో తెలుసుకుందామా..
ఓజోన్
వాహనాల పొగ నుంచి వచ్చే నైట్రస్ ఆక్సైడ్లు, సూర్యరశ్మి సమక్షంలో కొన్ని రకాల వాయువులతో కలిసినప్పుడు ఓజోన్ ఏర్పడుతుంది. భూమి చుట్టూ ఆవరించి రక్షణ ఛత్రంగా ఉపయోగపడే ఈ ఓజోన్.. ఇక్కడ మాత్రం ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దానివల్ల ఆస్తమా ఇబ్బందులు ఎక్కువైపోతాయి. గొంతు సమస్యలు కలుగుతాయి. దగ్గు, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.. చివరికి అకాల మరణాలకూ అది కారణమవుతోంది. ఓజోన్‌తో మొక్కలు, పంటలకూ నష్టమే.
కార్బన్ మోనాక్సైడ్
వాహనాల నుంచి, కలప, బొగ్గులు మండించినప్పుడు వెలువడే వాయువు కార్బన్ మోనాక్సైడ్. వాహనాల ఇంజిన్లు పాడైనా, వాటి నిర్వహణ సరిగా లేకున్నా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ వాయువు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది. దీనికి ఎక్కువగా ఎక్కువ పీల్చుకుంటే విపరీతమైన తలనొప్పి. తలతిరగడం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి. ఎక్కువ గాఢత కలిగిన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చితే మరణానికీ దారి తీస్తుంది. గుండెజబ్బు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.
సీసం..
పురాతనమైన పైపులు.. కొన్ని పారిశ్రామిక వ్యర్థాలు, కొన్ని రకాల కృత్రిమ రంగుల నుంచి వెలువడుతుంది. కొంతకాలం కిందటి వరకు పెట్రోలియం ఉత్పత్తుల్లోనూ ఉండేదిగానీ.. ప్రస్తుతం సీసాన్ని తొలగించి శుద్ధి చేస్తున్నారు. సీసం భారలోహం. ఇది పసిపిల్లల్లో మేధోశక్తిని తగ్గిస్తుంది. కొన్నిసార్లు కిడ్నీ సమస్యలకూ కారణమవుతుంది. పెద్దవాళ్లలో గుండెజబ్బులకు కారణం.
అతిసూక్ష్మ ధూళికణాలు
గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళికణాలను పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) అంటారు. పరిమాణాన్ని బట్టి ఇది పీఎం 10, పీఎం 2.5 అని రెండు రకాలు. వీటిలో పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి, రోడ్ల నిర్మాణాల సమయంలో, శిలాజ ఇంధనాల్ని మండించినప్పుడు ఈ పీఎం 2.5 కణాలు గాలిలోకి చేరుతాయి. శ్వాస తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దీంతో శ్వాసకోశ, ఉబ్బసం సమస్యలు ఎక్కువవుతాయి. క్షయ వంటి వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంటుంది.
ఆర్సెనిక్
కలపను శుద్ధి చేసేందుకు, కొన్ని ఇతర పారిశ్రామిక అవసరాలకు ఆర్సెనిక్‌ను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోని భూగర్భజలాల్లోనూ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకారి. తాకితే చాలు.. శరీరంలోకి చేరిపోతుంది. నాడీ మండలం, జీర్ణ వ్యవస్థలతోపాటు పునరుత్పత్తి వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతుంది.
ఆస్బెస్టాస్
వాహనాల్లోని క్లచ్‌లు, బ్రేక్ లైనింగ్‌లతోపాటు భవన శిథిలాల ద్వారా ఆస్బెస్టాస్ కణాలు గాలిలోకి విడుదలవుతుంటాయి. దీర్ఘకాలం ఈ కాలుష్యానికి గురైతే ఆస్బెస్టోసిస్ వ్యాధి వస్తుంది. ఊపిరితిత్తుల కేన్సర్‌తోపాటు మెసోథెలియోమా వ్యాధికీ ఆస్బెస్టాస్ కారణమవుతుంది. తాగేనీటి లో కలసి శరీరంలోకి చేరితే.. పేగులు, కడుపు, ఆహార నాళ కేన్సర్లకు దారితీస్తుంది.
బెంజీన్
పొగాకు ఉత్పత్తులు, గ్యాస్ స్టేషన్ల నుంచి బెంజీన్ విడుదలవుతుంది. జిగురు తయారీతోపాటు, ప్లాస్టిక్, నైలాన్‌లోనూ ఇది ఉంటుంది. ఫర్నిచర్‌ను మెరిపించేందుకు వాడే మైనంలోనూ బెంజీన్ ఉంటుంది. ఇది ఎముక మజ్జలో ఉత్పత్తయ్యే ఎర్ర రక్త కణాలను తగించడంతో రక్తహీనత ఏర్పడుతుంది. తెల్ల రక్త కణాలను, యాంటీబాడీలను కూడా చంపేస్తుంది.
సల్ఫర్ డయాక్సైడ్
శిలాజ ఇంధనాల వినియోగంతో సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశముంది. దీన్ని పీలిస్తే ఉబ్బసం సమస్య తీవ్రతరమవుతుంది. సల్ఫర్ తాలూకు ఆక్సైడ్లు ఇతర పదార్థాలతో కలసి శరీరం లోలోపలికి చొచ్చుకుపోగల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి.
మీథేన్
చెత్తతో కూడిన ప్రతీచోట మీథేన్ ఉత్పత్తి అవుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్నచోట కూడా ఇది వెలువడుతుంది. మిథేన్‌ను అధికంగా పీలిస్తే ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. శ్వాస వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 5 శాతం కంటే ఎక్కువ గాఢతతో ఉండే మీథేన్ వాయువుకు మండే స్వభావం అధికంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment