ప్రెషర్‌ కుక్కర్లు.. స్మార్ట్‌ఫోన్లు! | Akhilesh Yadav's Remark On Rahul Gandhi May Not Please Congress | Sakshi
Sakshi News home page

ప్రెషర్‌ కుక్కర్లు.. స్మార్ట్‌ఫోన్లు!

Published Mon, Jan 23 2017 3:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

ప్రెషర్‌ కుక్కర్లు.. స్మార్ట్‌ఫోన్లు! - Sakshi

ప్రెషర్‌ కుక్కర్లు.. స్మార్ట్‌ఫోన్లు!

లక్నో: ‘కామ్‌ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’నినాదంతో ఉత్తరప్రదేశ్‌ ప్రజల ముందుకు వచ్చారు సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌. ఉత్తరప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అఖిలేశ్‌ తండ్రి ములాయంసింగ్‌ యాదవ్, చిన్నాన్న శివ్‌పాల్‌ యాదవ్‌ గైర్హాజరయ్యారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ములాయం ఈ సమావేశానికి హాజరుకాలేదని భావిస్తున్నారు.

32 పేజీల పార్టీ మేనిఫెస్టోలో యూపీ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలపై హామీల వర్షం కురిపించారు అఖిలేశ్‌. రైతులు, మహిళలు, గ్రామీణులు, పేదలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. 300 సీట్లలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అఖిలేశ్, ములాయం చిత్రాలను ముద్రించినా.. శివ్‌పాల్‌కు చోటు దక్కలేదు.

ప్రధాని మోదీ, మాయావతిపై విమర్శలు
మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలకు దిగారు అఖిలేశ్‌. ‘అచ్చేదిన్ ’హామీ ఇచ్చిన వ్యక్తుల కోసం ప్రజలు తీవ్రంగా ఎదురు చూస్తున్నారని, మంచిరోజులు వస్తాయని ప్రజలు భావిస్తే.. చేతిలో చీపురు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రజలు యోగా చేయాల్సిన పరిస్థితులు కల్పించారన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తీసుకొచ్చిన ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌’నినాదానికి ఏమైందని ప్రశ్నించారు. బీఎస్‌పీ ఏనుగుల విగ్రహాలను ఏర్పాటు చేయడం మినహా యూపీ అభివృద్ధికి చేసింది శూన్యమని, వారు మరోసారి అధికారంలోకి వస్తే మరింత పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేస్తారని మాయావతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై మాయావతి స్పందిస్తూ.. తమ ఎన్నికల గుర్తును ప్రస్తావించడం ద్వారా అఖిలేశ్‌ ఉచిత ప్రచారం కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇవీ..
► ప్రాథమిక పాఠశాలల్లో వెనుకబడిన వర్గాల బాలలకు నెలకు లీటర్‌ నెయ్యి, ఉచితంగా పాల పౌడర్‌.
► వార్షిక ఆదాయం రూ1.5 లక్షల కంటే తక్కువ ఉంటే ఉచిత వైద్య సదుపాయం
► విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతుల కోసం సమాజ్‌వాదీ కిసాన్  కోశ్‌ పథకం..ప్రత్యేక నిధి
► గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ విద్యుత్తు
► 9–12 తరగతుల విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
►  పేద మహిళలకు ప్రెషర్‌ కుక్కర్లు, బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ
►  కోటి మంది ప్రజలకు రూ.వెయ్యి కోట్లతో సమాజ్‌వాదీ పెన్షన్  స్కీమ్‌ విస్తరణ
►  ఉచిత స్మార్ట్‌ఫోన్లు (వార్షికాదాయం రూ.2 లక్షలలోపే వుండాలి), విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.
►  పుర్వాంచల్‌–బుందేల్‌ఖండ్‌–తెరాయి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం
►  జానేశ్వర్‌ మిశ్రా మోడల్‌ గ్రామాల ఏర్పాటు
► పోలీసులు, మహిళలకు సహకారం అందించేందుకు హెల్ప్‌ లైన్  సెంటర్లు
► ఆగ్రా, కాన్పూర్, వారణాసి, మీరట్‌లో మెట్రో విస్తరణ
► గర్భవతులకు పౌష్టికాహారం సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement