ఊపిరి ఉన్నంతవరకు దేశం కోసమే పోరాడాడు!
జమ్మూ: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ప్యాంపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడుతూ.. అమరుడైన కెప్టెన్ తుషార్ మహాజన్‌కు ఆర్మీ ఘన నివాళులర్పించింది. జమ్మూలోని ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయంలో సోమవారం మహాజన్ నివాళి కార్యక్రమం జరిగింది. ఊపిరి ఉన్నంత వరకూ జన్మభూమి కోసం పోరాడి అమరుడైన మహజన్‌కు ఆర్మీ కమాండర్, ఇతర సీనియర్ అధికారులు ఘన నివాళి అర్పించారని డిఫెన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ కార్యక్రమానికి దక్షిణ కమాండ్ జనరల్ ఆఫీసర్ డీఎస్ హూడా, ఉదమ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి, డీఐజీ తదితర పోలీస్ అధికారులు, పౌర పరిపాలన అధికారులు కూడా ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. కెప్టెన్ తుషార్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఆర్మీ లాంఛనాలతో ఆయన స్వగ్రామంలో జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్యాంపోర్‌లో ఓ ప్రభుత్వ భవనంలో చొరబడిన ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూ తుషార్ మహాజన్ ప్రాణాలు విడిచారు.