‘క్యాంపాకోలా’కు పెరుగుతున్న మద్దతు
సాక్షి, ముంబై: క్యాంపాకోలా వాసులకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడ అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లలో ఉంటున్నవారిని ఖాళీ చేయించేందుకు, వారికి నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరాను నిలిపివేసేందుకు బీఎంసీ అధికారులు శుక్రవారం క్యాంపాకోలా కాంపౌండ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వీరిని అడ్డుకునేందుకు ఆర్పీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శనివారం కూడా బీఎంసీ అధికారులు కాస్త హడావుడి చేసినా రాజకీయ నాయకులతోపాటు సామాజిక కార్యకర్తలు కూడా వచ్చి మద్దతు పలకడంతో అధికారులు రెండో రోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
స్థానికులకు కొంత ఊరట లభించినట్లయింది. అయితే క్యాంపాకోలాపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన బీఎంసీ అధికారులను అడ్డుకున్నందుకుగాను పలువురిపై వర్లీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే బీఎంసీ అధికారులు వ్యవహరించినా, కోర్టు ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకోవడమంటే కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ముందునుంచి పక్కా ప్రణాళికతో ఉన్న క్యాంపాకోలావాసులు బీఎంసి అధికారులు లోపలికి చొరబడకుండా గేట్‌బయటే అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇలా విధులను అడ్డుకున్నందుకుగాను పలువురిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 143, సెక్షన్ 353ల ప్రకారం వర్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందునుంచే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించిన బీఎంసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీంతో శుక్రవారం ఇక్కడ ఉధ్రిక్త వాతావరణం కనిపించింది. అయితే శనివారం పోలీసు బందోబస్తును ఉపసంహరించడంతో బీఎంసీ అధికారులు వెనక్కు తగ్గారని భావించారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం తమ ఆందోళనను కొనసాగించారు. వీరికి మద్దతు పలికేందుకు ముంబై మాజీ కమిషనర్ ఖైర్నార్‌తోపాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సైనా ఎన్సీ కూడా వచ్చారు. దీంతో ఆందోళనకారుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది.
సోమవారం వరకు నో టెన్షన్...?
ఆదివారం సెలవుదినం కావడంతో బీఎంసీ అధికారులు వచ్చే అవకాశం లేదని, అయితే సోమవారం మాత్రం ఎలాగైనా ఖాళీ చేయించాలనే వ్యూహంతో అధికారులు రావొచ్చనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేశారు. దీంతో తామంతా పట్టుసడలించకుండా నివాసాలను కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉంటామని క్యాంపాకోలా వాసులు శనివారం ప్రతిజ్ఞ చేశారు.