అత్యాచార బాధితులకు బీఎంసీ అండ
కార్పొరేషన్ హాస్పిటల్‌ల్లో ప్రత్యేక వార్డులు
వివరాలన్నీ గోప్యంగా ఉంచాలని నిర్ణయం
పోలీసులే వచ్చి ఫిర్యాదు తీసుకుంటారని వెల్లడి
సాక్షి, ముంబై:
అత్యాచారానికి గురైన మహిళలు ఇక పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటువంటి వారి కోసం నగర పాలక సంస్థ (బీఎంసీ) తన ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో ‘సెక్సువల్ అసాల్ట్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ (సేఫ్)’ పేరిట ఓ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అయితే బాధితుల వివరాలు వెల్లడికాకుండా జాగ్రత్తలు పాటిస్తామని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.
‘అత్యాచార బాధితురాలు నేరుగా ఆస్పత్రికి రావొచ్చు. వారిని వైద్యులు సేఫ్ వార్డులోకి తరలిస్తారు. పరీక్షలు, వైద్య చికిత్స అందిస్తారు. పోలీసులు రహస్యంగా ఆస్పత్రికి వచ్చి బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరిస్తార’ని ఆయన వివరించారు. ఈ ‘సేఫ్’ కేంద్రం వల్ల అత్యాచార బాధితురాలు సురక్షితంగా ఉంటుందని బీఎంసీ వైద్య శిక్షణ విభాగం డెరైక్టర్ డాక్టర్ సుహాసినీ నాగద పేర్కొన్నారు. కేఈఎం, సైన్, నాయర్ ఆస్పత్రులతో సహా ఉపనగరాల్లో ఉన్న రాజావాడి, భగవతి, కూపర్ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఫోరెన్సిక్ విభాగ అధికారులతో సమావేశమయ్యానని వివరించారు.
‘ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డుకు సేఫ్ వార్డు ఆనుకొని ఉంటుంది. బాధిత మహిళను ఫోరెన్సిక్, మానసిక చికిత్స వైద్య నిపుణులు పరీక్షిస్తారు. చికిత్స కూడా ఇక్కడనే జరుగుతుంది. ఆమె వివరాలను వైద్యులు పోలీసులకు తెలుపుతార’ని డాక్టర్ సుహాసినీ తెలిపారు. అత్యాచారం జరిగితే ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రపంచంలో కేవలం 20 శాతం మంది మహిళలే ఫిర్యాదు చేస్తున్నారన్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యాచార బాధితుల కోసం ఆస్పత్రుల్లో ‘సేఫ్’ వార్డును ఏర్పాటుచేశారన్నారు. ఈ కేంద్రంలో పనులు అత్యంత రహస్యంగా ఉండటం వల్ల బాధితురాళ్లు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తారని తెలిపారు. పోలీసుల దర్యాప్తు కూడా రహస్యంగా జరగడంతో నిందితులను పట్టుకోవడంతో పాటు వారికి శిక్ష కల్పించడం సులభమవుతుందని ఆమె వివరించారు.
ఆస్పత్రిలో చేరితే ‘సేఫ్’
Published Sun, Dec 1 2013 11:35 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement