సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ యూరప్‌లో ఎలాంటి రాజకీయ హింస లేకుండా కొన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంది. స్పెయిన్‌లోని ఈశాన్య ప్రాంతమైన కటలోనియా తమకూ స్వాతంత్య్రం కావాలంటూ నినదించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్వాతంత్య్రం కోరుతూ ఆదివారం నిర్వహించిన రిఫరెండమ్‌లో పాల్గొంటున్న ప్రజలపై స్పానిష్ దళాలు పాశవికంగా దాడి చేయడం ప్రపంచ హృదయాలను కలచివేసింది. నోటి నుంచి రక్తం ధారలుగా కారుతున్న ఓ ముసలి అవ్వ, సైనికులు, ప్రజల మధ్య ముష్టి యుద్ధం తాలూకు చిత్రాలు ఐరోపా దేశాలను కదిలించాయి. సమస్యకు సామరస్య పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా స్పానిష్ నేతలకు పిలుపునిచ్చాయి.
కటలోనియా ప్రజలు తమకు స్వాతంత్య్రం కావాలంటూ అసలు ఎందుకు తిరగబడ్డారు? భాషా పరంగా, సంస్కృతిపరంగా, ఆర్థికంగా తరతరాలుగా స్పానిష్ పాలకులు తమను దోచుకోవడాన్ని సహించలేక ఒక్కసారిగా తిరుగుబాటు నినాదాన్ని అందుకున్నారు. స్పానిష్‌కు ఈశాన్యంలో ఉన్న కటలోనియా ప్రజలను కటాలన్లు అని వ్యవహరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని స్పెయిన్ స్వాధీనం చేసుకునే వరకు వారు రోమన్ల భాషనే మాట్లాడుతూ వచ్చారు.
ఆ తర్వాత కూడా వారు అదే భాషా సంప్రదాయాలను పాటిస్తూ వచ్చారు. 1939లో స్పానిష్ అంతర్యుద్ధం ముగిశాక అధికారంలోకి వచ్చిన జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో ఫాసిస్టు ప్రభుత్వం కటాలన్లపై బలవంతంగా స్పానిష్ భాషను రుద్దింది. జాతీయ భావం పేరిట కఠిన చట్టాలను తీసుకొచ్చింది. భాషా, సంస్కృతి పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా సమద్ధి చెందిన కటలోనియా నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల అభివద్ధి కోసం ఖర్చు చేస్తుండడం, కటలోనియా ప్రాంతాన్ని అంతగా పట్టించుకోక పోవడం ప్రజలను రగిలిస్తూ వచ్చింది.
రేపు భారత్‌లోనూ ఇదే పరిస్థితి రావచ్చు!
ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల ఆదాయంతో హిందీ భాషా రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో హిందీ భాషా ప్రాంతాలపై ప్రాభల్యం కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా జాతీయతా స్ఫూర్తితో దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అన్ని రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి చేయాలని బీజేపీ మంత్రులు పలుసార్లు ప్రతిపాదనలు చేశారు. తమ భాషాను పరిరక్షించుకోవడంతోపాటు కేంద్రానికి ఓ హెచ్చరిక జారీ చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్కూళ్లలో బెంగాలీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చట్టం తీసుకొచ్చారు. ఆ స్ఫూర్తితో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు తమ మాతృ భాషలను తప్పనిసరి చేస్తూ చట్టాలు తీసుకొచ్చాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన అధిక ఆదాయంతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగిస్తోంది. జీఎస్టీ రాకముందు వరకు ఈ రాష్ట్రాలు సరాసరి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే కేంద్రం నుంచి వెనక్కి వచ్చింది సరాసరి 46 పైసలే. అదే యూపీ, బీహార్ రాష్ట్రాలు రూపాయి చెల్లిస్తే వాటికి సరాసరి కేంద్రం నుంచి ముట్టిన సొమ్ము 1.75 రూపాయలు. ఆర్థికంగా తమకు అన్యాయం చేస్తున్న కేంద్రం భాషాపరంగా కూడా తమకు ద్రోహం చేయరాదని కోరుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్రం నిర్వహిస్తున్న జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల పేరిట తమిళనాడు లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది.
హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం మొదట పుట్టిందే తమిళనాడులో. కటలోనియాలోలాగానే భారత్‌లో కూడా 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జాతీయ అధికార భాషగా హిందీని దేశ ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పటి ప్రెసిడెన్షియల్ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పటి పాలకులు వెనక్కి తగ్గి ఆంగ్ల భాషనే అధికార భాషగా కొనసాగించారు. అయితే హిందీకి కూడా అధికార భాష హోదాను కల్పించారు. హిందీ భాషను రుద్దేందుకు ప్రయత్నాలను మాత్రం పాలకులు వదిలిపెట్టలేదు. ఆర్థిక దోపిడీ కూడా అప్పటి నుంచి అలాగే కొనసాగుతూ వచ్చింది.
1961లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి 100 రూపాయలు వసూలు చేస్తే వెనక్కి 16.20 రూపాయలు ఇస్తోందని, అందే బీహార్ రాష్ట్రం నుంచి 100 రూపాయలు వసూలు చేస్తూ 182.80 రూపాయలు వెనక్కి ఇస్తోందంటూ రంజిత్ రాయ్ అనే బెంగాలీ జర్నలిస్ట్ రాసిన వార్తా కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. 1965లో తమిళనాడు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం దేశాన్నే కుదిపేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మళ్లీ పాలకులు అలాంటి ప్రయత్నాలకు పాల్పడితే కటలోనియాలోలాగా అలజడి పుడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment