‘ఫేక్‌’ల మూలం కనుక్కోవాల్సిందేనంటున్న కేంద్రం...! | Central Government Focuses On Fake News Source In Whatsapp | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌’ల మూలం కనుక్కోవాల్సిందేనంటున్న కేంద్రం...!

Published Sat, Sep 22 2018 6:51 AM | Last Updated on Sat, Sep 22 2018 9:43 AM

Central Government Focuses On Fake News Source In Whatsapp - Sakshi

నకిలీ వార్తలు, వదంతులు అరికట్టేందుకు తీసుకునే చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్‌ల మధ్య వేడి మరింత పెరుగుతోంది.ఫేక్‌న్యూస్‌లు, వీడియోలు, మెసేజ్‌లకు మూలం ఎక్కడో,  వాటిని ఎవరు పంపిస్తున్నారో ట్రాక్‌ చేసే విధానాన్ని రూపొందించాలంటూ ఆ సంస్థపై కేంద్రం ఒత్తిడిని పెంచుతోంది. ఇప్పటికే ఆ సంస్థకు రెండు నోటీసులు పంపాక కూడా స్పష్టమైన హామీ రాకపోవడంతో త్వరలోనే మూడో నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  వాట్సాప్‌  మాధ్యమం ద్వారా వదంతులు,  నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోయి . చిన్న పిల్లలను ఎత్తుకెళుతున్నారని, ఇతర ’ఫేక్‌వార్తలు’ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మూకదాడులకు దారితీశాయి. ఏడాది కాలంలోనే 30 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మెసేజ్‌ల ఎక్కడి నుంచి వస్తున్నాయో మూలం కనిపెట్టే విధానాన్ని అమల్లోకి తేవాలంటూ ఈ సంస్థకు ఇటీవల  కేంద్ర ఐటీశాఖ హెచ్చరికలు కూడా చేసింది.

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విషయంలో రాజీపడకుండానే  ఈ సమస్యకు సాంకేతికపరమైన పరిష్కారాన్ని కనుక్కోవచ్చునని ఈ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వాట్సాప్‌ మాత్రం ఇవి యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగమని వాదిస్తోంది.  ఒకేసారి లెక్కకు మించి ఫార్వర్డ్‌  చేసే మెసేజ్‌లకు సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్‌  చేయవచ్చునంటున్నారు. ఏదైనా అంశంపై ప్రజలను రెచ్చగొట్టేవిధంగా లేదా చర్చనీయాంశమై వైరల్‌గా మారిన మెసేజ్‌ ఒరిజనల్‌గా ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం ద్వారా దీని మూలాన్ని కనుక్కోవచ్చునని అంటున్నారు.  ఏదైనా ఓ మెసేజ్‌ వందసార్లకు పైగా ఫార్వర్డ్‌ అయ్యి, శాంతి,భద్రతల సమస్య తలెత్తేందుకు కారణమైందో అలాంటిది ఒరిజనల్‌గా  ఎక్కడి నుంచి వచ్చిందో వాట్సాప్‌ బాధ్యులు కనిపెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు

మనదేశంలో వాట్సాప్‌ను అత్యధికసంఖ్యలో ఉపయోగిస్తుండడంతో ఈ మాధ్యమం ద్వారా నకిలీ వార్తలు, వదంతులను అరికట్టడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు వ్యవస్థలకు సవాల్‌గా మారింది. ఈ విషయంలో జవాబుదారీతనం పెరగాలని, నకిలీవార్తల ప్రచారం ద్వారా జరిగే అరాచకాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలంటూ వాట్సాప్‌ సంస్ధను దారికి తెచ్చేందుకు కేంద్రం వివిధ పద్ధతులను అవలంబిస్తోంది. అయితే  ప్రభుత్వ వత్తిళ్ల నేపథ్యంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు, ఇమేజీలు, వీడియోలు  షేర్‌ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ’వాట్సాప్‌’ నియంత్రణ చర్యలు చేపట్టింది.  ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌గా కొనసాగుతున్న వాట్సాప్‌ ద్వారా యూజర్ల  భద్రతా, గోప్యతను కాపాడేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.  ఒరిజనల్‌ మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రాక్‌ చేసే పద్ధతులు కనుక్కోవాలనే భారత ప్రభుత్వ డిమాండ్‌కు మాత్రం ఆ సంస్థ తలొగ్గడం లేదు.

ఇది ఎండ్‌ లు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌పై ప్రభావం చూపడంతో పాటు వినియోగదార్ల గోప్యతను దెబ్బతీసినట్టు అవుతుందని గట్టిగా వాదిస్తోంది. అయితే ఇతర డిమాండ్లకు తలొగ్గి తనవైపు నుంచి చర్యలు చేపట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేస్తున్నది భారత వాట్సాప్‌ యూజర్లే కావడంతో ఒకేసారి ఐదుగురికే వీటిని ఫార్వర్డ్‌ చేసేలా నియంత్రణ చర్యలు చేపట్టింది. దీంతో పాటు  తమ యాప్‌లో మీడియా మెసేజ్‌స్‌కు పక్కనే ఉన్న క్విక్‌ ఫార్వర్డ్‌ బటన్‌ తొలగించినట్టు తెలిపింది.. వాట్సాప్‌ యూజర్లు  సొంతంగా పంపించే  (ఒరిజనల్‌) మెసేజ్‌ ఏదో, ఫార్వర్డ్‌ చేసిన మెసేజ్‌ ఏదో గుర్తించే ఫార్వర్డ్‌ లేబుల్‌ను కూడా  ఈ సంస్థ  ఇప్పటికే మొదలుపెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement