స్నేహితులతో కలిసి బిర్యానీ తింటుంటే దుర్ఘటన
న్యూఢిల్లీ: స్నేహితులతో కలిసి బిర్యానీ తింటున్న ఏడేళ్ల బాలుడు దురదృష్టవశాత్తు మృత్యువాత పడ్డాడు. ప్రహరీ గోడ మీద కూలి చనిపోయాడు. సివిక్ కార్పొరేషన్ చర్య ఈ దుర్ఘటనకు కారణమైంది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఢిల్లీలోని జందేవాలన్ కు సమీపంలోగల ఫైజే రోడ్డులో ఎంసీడీ కాంప్లెక్స్ ఉంది. దీనికి ప్రహరీ నిర్మిస్తున్నారు. అదే సమయంలో సివిక్ కార్పొరేషన్ అధికారులు ఆ గోడకు అడ్డుగా ఉందని ఒక చెట్టును నరికించడం మొదలుపెట్టారు.
దీంతో ఆ కొమ్మలు నరికే క్రమంలో కొన్ని గోడపై పడి అది కాస్త అక్కడే ఉన్న షాపులో బిర్యానీ తింటున్నవారిపై పడటంతో ఏడేళ్ల బాలుడు చనిపోయాడు. మిగితావారు గాయపడ్డారు. మరో విషాదం ఏమిటంటే ఆ బాలుడు తండ్రి అదే గోడ నిర్మాణ పనులకు వచ్చాడు. చనిపోయిన తన కుమారుడిని చూసి తీవ్రంగా విలపించాడు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.