తిరువనంతపురం : పట్టుదల ఉంటే సాధించలేనిది లేదంటూ ఓ బామ్మ 105 ఏళ్ల వయసులోనూ సత్తా చాటారు. దేశంలోనే అత్యధిక వయసు కలిగిన స్టూడెంట్‌గా ఆమె నాలుగో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. గత ఏడాది కేరళలోని కొల్లాంలో రాష్ట్ర సాక్షరతా మిషన్ నిర్వహించిన పరీక్షలకు వందేళ్లు దాటిన బాగీరథి అమ్మ హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను సాక్షరత్ మిషన్ బుధవారం వెల్లడించింది. పరిస్థితుల ప్రభావంతో తన తొమ్మిదో ఏట మూడో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి రావడంతో ఎప్పటికైనా విద్యాభ్యాసంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె నిత్యం పరితపించేవారు. చిన్ననాటే తల్లిని కోల్పోయి తనకంటే చిన్నవారైన చెల్లెళ్లు, తమ్ముళ్లను పెంచే బాధ్యత తలకెత్తుకోవడంతో ఆమె తన కలను నెరవేర్చుకోలేకపోయారు.
వివాహానంతరం ముఫ్పై ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోవడంతో తన ఆరుగురి సంతానాన్ని పెంచి పెద్దచేసే బాధ్యతలనూ ఆమె స్వీకరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇన్నేళ్లకు చదువుకోవాలన్న తన ఆక్షాంక్షను ఆమె నెరవేర్చుకున్నారు. వయోభారంతో పరీక్షల్లో రాయలేకపోవడంతో మూడు ప్రశ్నాపత్రాలను పూర్తి చేసేందుకు ఆమె మూడు రోజులు తీసుకున్నారని సాక్షరతా మిషన్ వర్గాలు తెలిపాయి. తాను పదో తరగతికి సమానమైన పరీక్షకు హాజరవుతానని బాగీరథి అమ్మ విశ్వాసంతో చెబుతున్నారు. మరోవైపు సాక్షరతా మిషన్ నిర్వహించిన అక్షరలక్షమ్ కార్యక్రమంలో 96 ఏళ్ల కార్తియని అమ్మ 100కు 98 మార్కులు సాధించారని మిషన్ తెలిపింది. కాగా నాలుగేళ్లలో కేరళ రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నదే తమ లక్ష్యమని సాక్షరతా మిషన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment