- కాలుష్యాన్ని బట్టి పరిశ్రమలకు కొత్త వర్గీకరణ
- ప్రతిపాదించిన పర్యావరణ శాఖ.. ఆన్‌లైన్లో పర్యావరణ అనుమతులు
న్యూఢిల్లీ: కాలుష్య ఉద్గారాల స్థాయిని బట్టి పరిశ్రమలను కొత్తగా వర్గీకరించాలని కేంద్ర పర్యావరణ శాఖ ప్రతిపాదించింది. కాలుష్య స్థాయి 60 దాటిన పరిశ్రమలకు ఎరుపురంగు, 30-59 మధ్య ఉన్న వాటికి నారింజ(ఆరెంజ్) రంగు, 29-15 మధ్య స్థాయిలో కాలుష్యకారకాలను విడుదల చేస్తున్న పరిశ్రమలకు ఆకుపచ్చ రంగు, 15 లోపు కాలుష్యస్థాయి ఉన్న వాటికి తెలుపురంగు కేటాయిస్తూ వర్గీకరించాలని ప్రతిపాదించారు. కాలుష్య స్థాయి 15లోపు ఉన్నవాటిని పర్యావరణ మిత్ర పరిశ్రమలుగా గుర్తిస్తారు. గతంలో పరిశ్రమల వర్గీకరణలో కాలుష్య స్థాయిని పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ప్రతీ ఏడాది పరిశ్రమలను రెన్యువల్ చేయించాలనే నిబంధనను కూడా మార్చాలని నిర్ణయించారు. విద్యుదుత్పత్తి ప్లాంట్లు, సిమెంటు ఫ్యాక్టరీలు, తోళ్ల శుద్ధి కార్మాగారాలు.. తదితర 17 పారిశ్రామిక విభాగాలున్న రెడ్ కేటగిరీ పరిశ్రమలకు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి, ‘నారింజ’ కేటగిరీకి 10 ఏళ్లకు ఒకసారి, ‘ఆకుపచ్చ’ కేటగిరీకి ఒకేసారి లైఫ్‌టైమ్ సర్టిఫికేషన్ ఇచ్చేలా రెన్యువల్ నిబంధనలను రూపొందించనున్నారు.
ఈ ప్రతిపాదనకు రాష్ట్రాల పర్యావరణ, అటవీ శాఖల మంత్రుల జాతీయ సదస్సు ఆమోదం తెలిపింది. మంగళవారం ముగిసిన ఆ సదస్సులో రాష్ట్రాలు ఆమోదించిన ఇతర తీర్మానాల వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. పర్యావరణ నిబంధనలను పాటిస్తున్న స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లకూ ‘స్టార్స్’ను కేటాయించాలనే ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు ఆన్‌లైన్‌లో పర్యావరణ అనుమతులను జారీ చేసే ప్రక్రియను ఈ అక్టోబర్‌లోగా ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలలను కేంద్రం ఆదేశించిందన్నారు. పర్యావరణ, అటవీ అనుమతులను ఆన్‌లైన్లో జారీ చేయడం కేంద్రం ఇప్పటికే ప్రారంభించిందని, అదే విధానాన్ని రాష్ట్రాలు కూడా అనుసరించాలని సూచించారు.బ్యాక్‌లాగ్ అటవీ అనుమతుల ప్రక్రియను ఈ జూన్ 31లోగా అన్ని రాష్ట్రాలు ముగించాల్సి ఉందని జవదేకర్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి గ్రీన్ క్లైమేట్ ఫండ్‌కు సమర్పించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ రాష్ట్రం కనీసం ఒక వాతావరణ మార్పు ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉందన్నారు.