
ఆ నటుడిది ఆత్మహత్యా.. హత్యా! తేల్చనున్న సీబీఐ
తిరువనంతపురం: ప్రముఖ మళయాల నటుడు కళాభవన్ మృతి కేసు మరోమలుపు తిరగనుంది. ఆయన చనిపోయిన మూడు నెలలు అవుతున్నా రాష్ట్ర పోలీసులు కనీసం ఒక్క ఆధారం గుర్తించలేకపోవడం, ఆయన మృతికి ఒక్క కారణాన్ని స్పష్టంగా వెల్లడించకపోవడంతోపాటు దర్యాప్తు పెడదోవ పట్టిందన్న ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను రాసింది.
కళా భవన్ మృతి కేసు విచారణ సీబీఐకి ఇవ్వాలని అందులో కోరింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సోదరుడు ఆర్ఎల్ వీ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇక నిజాలు ఏమిటో త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. దాదాపు 200 మళయాల ఇతర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కళాభవన్.. అనుమానాస్పద స్థితిలో మార్చి 6న మృతిచెందాడు. అతడి మృతదేహంలో విష రసాయనాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి వెనుక కొందరి హస్తం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ప్రారంభమైంది.