లంచం అడిగితే వీడియో తీసి పంపండి
దరువు సినిమాలో రెండో రవితేజ (బుల్లెట్ రాజా) అవినీతిపరుల ఆట కట్టించడానికి 'ఎంఎంఎస్ పెట్టు.. బహుమతి కొట్టు' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడతారు. దాని ప్రకారం ఎవరైనా లంచం అడిగితే.. వీడియో తీసి ఎంఎంఎస్ చేయాలి. అప్పుడు వాళ్ల విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ కూడా సరిగ్గా ఇలాగే చెబుతున్నారు. అవినీతిని కూకటివేళ్లతో సహా పీకిపారేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందువల్ల ఎవరైనా లంచం అడిగితే అస్సలు ఊరుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వోద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే వీడియో క్లిప్ తీయాలని చెప్పారు. బృందావనంలోని గోవిందవిహార్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయనీ విషయం తెలిపారు.
యూపీలో నెల రోజుల బీజేపీ పాలన గురించి మాట్లాడుతూ, ''ఇప్పటికి ట్రైలర్ మాత్రమే చూశారు, సినిమా ఇంకా ముందుంది'' అని చెప్పారు. రాష్ట్రం నుంచి అవినీతిని తరిమేయడానికి, అభివృద్ధిని సాధించడానికే ఒక సన్యాసిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ ఎన్నుకున్నారన్నారు. మథురకు త్వరలోనే మెట్రో కనెక్టివిటీ వస్తుందని, బ్రిజ్ చౌరాసి కోస్ పరిక్రమ ప్రాంతానికి త్వరలోనే తాగునీరు అందిస్తామని మంత్రి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌ను ఉత్తమ ప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మరో మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి అన్నారు. యమునానదిని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.